రెండో ఐపీఎల్!
టి20 క్రికెట్లో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న టోర్నీ చాంపియన్స్ లీగ్. భారత్ నుంచి ఎక్కువ జట్లు బరిలోకి దిగడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెందిన పటిష్టమైన టీమ్‌లు పోటీపడుతుండటంతో టోర్నీపై ఆసక్తి రేపుతోంది. ఆయా దేశాల నుంచి ప్రతి ఏటా పాల్గొంటున్న జట్లు మారుతూ ఉండటం వల్ల ఐపీఎల్‌తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో జట్లను ఈ టోర్నీలో చూసే అవకాశం కలుగుతోంది. ఈ సారి ఇంగ్లండ్ టోర్నీకి దూరంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభమైన (2008) మరుసటి ఏడాది నుంచి సీఎల్‌టి20 జరుగుతోంది. ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోయినా ప్రతీ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సీఎల్‌టి20 కూడా తక్కువేమీ కాదు.
సాక్షి క్రీడా విభాగం
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి భారత్ మరోసారి వేదికైంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుల భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి రెండుసార్లు భారత్ ఆతిథ్యమివ్వగా, మరో రెండుసార్లు దక్షిణాఫ్రికాలో జరిగింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అక్టోబర్ 6న ముగుస్తుంది. ఈ నెల 17, 18, 20 తేదీల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు... 21 నుంచి ప్రధాన మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సీఎల్‌టి20 గత రికార్డులు, టోర్నీ విశేషాలపై ‘సాక్షి’ ఫోకస్
10 జట్లతో...
ఈసారి టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా, రెండు టీమ్‌లు క్వాలిఫయర్స్ ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మొత్తం జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో టీమ్ తన గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
క్వాలిఫయర్స్‌లో ఆడుతున్న జట్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఫైసలాబాద్ వోల్వ్స్, కందురతా మారూన్స్, ఒటాగో వోల్ట్స్.
చూడదగ్గ ఆటగాళ్లు: సచిన్, రోహిత్, పొలార్డ్, ధోని, రైనా, డ్వేన్ బ్రేవో, మిస్బా, అజ్మల్, బ్రెండన్ మెకల్లమ్, ద్రవిడ్, వాట్సన్, ధావన్, స్టెయిన్, డివిలియర్స్, నరైన్, సంగక్కర, అజంత మెండిస్.
చాంపియన్స్ లీగ్ రికార్డులు
అత్యధిక స్కోరు: 215/8 (బెంగళూరు, సౌత్ ఆస్ట్రేలియాపై)
అత్యధిక పరుగులు: వార్నర్ (13 మ్యాచుల్లో 556)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: వార్నర్ (135 నాటౌట్)
అత్యధిక సిక్స్‌లు: పొలార్డ్ ( 20 మ్యాచుల్లో 38)
ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు: వార్నర్ (11)
అత్యధిక వికెట్లు: మలింగ ( 14 మ్యాచుల్లో 24)
అత్యుత్తమ బౌలింగ్: అజహర్ మహమూద్ (5/24)