మాటలు చెప్పి..మభ్యపెట్టి..
- రాత్రికి రాత్రే తహశీల్దారుతో హైదరాబాదుకు..
- కమిటీ పేరుతో కాలయాపనకు సీఎం చంద్రబాబు యత్నం
- ఇసుక తవ్విన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలోకి వస్తుందని సర్వే బృందం నిర్ధారణ?
- అధికారాన్ని ఉపయోగించి తహశీల్దార్‌దే తప్పని తేల్చిన ప్రభుత్వం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ముసునూరు తహశీల్దార్ వనజాక్షి పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి నిరసనగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. శుక్రవారం నగరంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులతో రాష్ట్ర మంత్రి ఉమామహేశ్వరరావు జరిపిన చర్చలు ఫలించని విషయం తెలిసిందే.
దీంతో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ.. రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నేతలు ఆమెకు సమాచారం అందించి.. రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తీసుకువెళ్లటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేతలకు సమాచారం అందించి రప్పించారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో సీఎం స్థాయిలో బెదిరింపు ధోరణితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను పరోక్షంగా బెదిరించి.. కంటితుడుపుగా ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేస్తున్నట్లు సీఎం చెప్పడం, కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటానని చెప్పి పంపించేయడం ఈ వ్యవహారాన్ని నీరుగార్చడానికేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించడం ఒత్తిడి మేరకేనని అర్థమవుతోంది.
తహశీల్దారుపై నెపం మోపేలా...
శనివారం ఉదయం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సర్వే బృందం ముసునూరు మండలం రంగంపేట వద్ద ఉన్న తమ్మిలేరు వాగు వద్ద సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇసుక తీసిన వాగు ప్రాంతం కృష్ణాజిల్లా పరిధి దాటి.. పది మీటర్లు అవతల పశ్చిమగోదావరిలో ఉన్నట్లు తేల్చారు. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే తహశీల్దార్‌దే తప్పని నేతలు ఒక విధంగా తీర్పు చెప్పించారు. ఘటన జరిగిన రోజు తవ్వకాలను అడ్డుకున్న తహశీల్దారు.. సర్వే అనంతరం పశ్చిమగోదావరి పరిధిలోకి వస్తే తవ్వుకోవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయినా ఆమెపై దాడికి దిగటం గమనార్హం. ఇప్పుడు మాత్రం హడావుడిగా సర్వే నిర్వహించడం వెనుక అంతరార్థమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.