భూకంపాలకు ఇసుకతో చెక్!
కాకతీయుల టెక్నాలజీ భేష్
నేపాల్లో సంభవించిన భూకంపం ఉపఖండంలో భవనాల భద్రతను ప్రశ్నిస్తోంది. కానీ 800 ఏళ్ల క్రితమే తెలుగునేలను పరిపాలించిన కాకతీయులు భూకంపాలను తట్టుకునేవిధంగా భారీ ఆలయాలను నిర్మించారు. వేయిస్తంభాలగుడి, రామప్పదేవాలయం నిర్మాణాల్లో ‘శాండ్బాక్స్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో భూకంపాలను తట్టుకుని నేటికీ అవి సగర్వంగా నిలిచి ఉన్నాయి.
సాక్షి, హన్మకొండ: రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుతం ఎన్ఐటీ) వరంగల్ సహకారంతో భారత పురావస్తుశాఖ ఆధ్వర్యంలో 1980వ దశకంలో కాకతీయుల చారిత్రక కట్టడాలపై పరిశోధనలు జరిగాయి. దీంతో తొలిసారిగా ఇసుక పునాదిపై భారీ నిర్మాణాల అంశం వెలుగులోకి వచ్చింది. కాకతీయుల సాంకేతిక నైపుణ్యా న్ని శాండ్ బాక్స్ టెక్నాలజీగా పేర్కొంటూ 1991లో అప్పటి ఆర్ఈసీలో పురావస్తు అధికారులు సదస్సు నిర్వహిం చారు. కాకతీయులు నాడు భారీ నిర్మాణాలకు పునాదిగా ఇసుకను ఉపయోగించారు.
నిర్మాణం విస్తరించి ఉండే ప్రదేశంలో మొత్తాన్ని కనీసం 3 మీటర్ల లోతు తవ్వి పునాదికి సిద్ధం చేస్తారు. ఈ పునాదిలో పూర్తిగా ఇసుక నింపారు. ఈ ఇసుక మిశ్రమానికి గట్టిదనం ఇచ్చేందుకు కరక్కాయ, బెల్లం, గ్రానైట్పొడులతో మిశ్రమాన్ని జతచేశారు. ఈ ఇసుక పునాది మీదే భారీ శిలలతో కూడిన ఆలయాన్ని నిర్మించారు. భూకంప తరంగాలను ఈ ఇసుక పునాది శోషించుకోవడం వల్ల నిర్మాణాలకు నష్టం జరగదు.
వచ్చినా ప్రమాదం లేదు: శాండ్బాక్స్ టెక్నాలజీ ఆధారిత పునాదిని దాటుకుని పైకి వెళ్లిన భూకంప తరంగాల ధాటికి ప్రదిక్షణ పథం, కక్షాసనం, గోడలు, పైకప్పులలో వినియోగించిన శిలలు విడిపోకుండా ఉండేం దుకు ఇనుప పట్టీలు అమర్చా రు. ఇందుకోసం నిర్మాణంలో వినియోగించిన 2 శిలలు, శిల్పాలు కలిసే చోట శిలను తొలిచి దీనిలో కరిగించిన ఇనుము పోశారు. దీంతో 2 శిలల్ని ఈ ఇనుప పట్టీలు గట్టిగా పట్టివుంచుతాయి. దీంతో నిర్మా ణం మొత్తం ఒకే ఫ్రేమ్లాగా మారిపోయింది.
ప్రకంపనలను తట్టుకున్న ‘రామప్ప’: గతంలో వచ్చిన భారీ భూకం పాలను తట్టుకుని నిలిచిందనడానికి రామప్ప దేవాలయం తార్కాణంగా నిలుస్తోంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న నాలుగు స్తంభాల మండపంలో ముందు వరుసలో కనిపించే రెండు స్తంభాల మధ్య ఉన్న భారీ శిలను పరిశీలిస్తే.. ఈ విషయం రుజువవుతుంది.
ఒత్తిడిని తగ్గించే శాండ్బాక్స్ టెక్నాలజీ
సాధారణ నిర్మాణాల్లో పునాదిని చాలా దృఢంగా నిర్మిస్తారు. భవనం బరువు మొత్తం మోయగలిగేలాఈ జాగ్రత్త పాటిస్తారు. కానీ కాకతీయులు భారీ నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇసుకను పునాదిగా వాడారు. ఇది కుషన్లా పనిచేస్తుంది. నలువైపుల నుంచి పడే ఒత్తిడిని ఇది తనలో ఇముడ్చుకోగలుగుతుంది. అందువల్ల భూకంపం వల్ల వెలువడే పీ(ప్రైమరీ), ఎస్ (సెకండరీ) తరంగాలు ఈ పునాదిని దాటుకుని పైనున్న నిర్మాణాన్ని చేరుకునేలోపు కొంత శక్తిని కోల్పోతాయి.
- డాక్టర్ పి.రతీశ్కుమార్ (ఎంటెక్ (స్ట్రక్చర్స్), అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం)