అంబేడ్కర్‌ని అర్థం చేసుకున్నామా?!
అంబేడ్కర్ ఇచ్చిన మూడు నినాదాలు educate, organise, agitate... అనేవి నేటికీ అవసరమవుతున్నాయంటే అవి నిత్య సత్యాలనుకోవాలో, మన అలసత్వానికి తలదించుకోవాలో తెలియకుండా ఉంది.
బొజ్జా విజయభారతి
అంబేడ్కర్ ఏ లక్ష్యసాధన కోసం తన జీవితసర్వస్వాన్నీ తన భక్తిజ్ఞాన వైరాగ్యాలనూ ధారబోశాడో ఈ దేశం ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా అర్థం చేసుకున్నదా? లేదు. educate.. అంటే సంతకం చేయటం నేర్పడం,organise కావటం అంటే గొర్రెలను... తోడేళ్లు, నక్కలూ చేరదీయటం.agitate అంటే ‘పోరాడు’ అనీ ఆందోళన చెయ్యి అనీ అనుకుంటున్నాం! సమాజంలో మానవకల్పితమైన అధర్మాలనూ అన్యాయాలనూ కొనసాగిస్తూనే ఉన్నాం. సమైక్య భావన ఎక్కడ? అన్ని సమస్యలకూ రాజకీయాలే మొదలూ తుదీ అవుతున్నప్పుడు రాజకీయ దౌర్జన్యాలను ఎదుర్కొనే పోరాటపటిమ ఎక్కడ?
మతాలు మనుషులకు నీతినియమాలు బోధించాయి. ఊహా ప్రపంచాలను చూపించాయి. అభూత కల్పనలతో మనిషిని ముంచెత్తాయి, భయపెట్టాయి. అంతేకాని మనిషి సుఖంగా జీవించటానికి కావలసిన జీవితావసరాలను అందించటానికి మార్గాలు చూపించలేక పోయాయి. మనిషి మనిషిగా బతకటం కోసం పోరాటం తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. ‘బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య’ అనే సూత్రాన్ని పూర్వ ప్రవక్తలు వేదాంతానికే అన్వయించి ఊరుకున్నారు. దానిని వాస్తవ ప్రాపంచిక వ్యవస్థకు అన్వయించి ఆచరణలోపెట్టి ఉంటే ఎలా ఉండేదో! పంచవర్ష ప్రణాళికలు నిజాయితీగా అమలుచేసి ఉంటే ఎలా ఉండేదో! కానీ అలా జరగలేదు.
సామాజిక అసమానతలూ కులమతలింగ పరమైన వివక్షలూ తారస్థాయిని చేరిన నేటి సమాజానికి అంబేడ్కర్ సూచించిన పోరాట మార్గమే అవశ్యకర్తవ్యంలాగా కనిపిస్తోంది. సంఘటితమై రాజకీయశక్తిగా మారి సమసమాజాన్ని నెలకొల్పుకోవాలన్నారు అంబేడ్కర్. ఇప్పుడు రాజకీయశక్తులు సంఘటితంగా జనాన్ని మింగేస్తున్న ఈ శుభసమయంలో మహాభారతంలోని పద్యం.. ‘సారపుధర్మమున్ విమల సత్యము...’ అనేది గుర్తుకువస్తోంది. రక్షకులే అధర్మానికి పూనుకొన్నప్పుడు సమర్థులైనవారు చూస్తూ ఊరుకోవటం దోషం.
ఎప్పటికైనా ధర్మము, సత్యమూ నిలబడతాయి.. నెగ్గుతాయి. దైవం ఆ బాధ్యత తీసుకుంటాడు.. అన్నారు ఆ పద్యంలో. అది అప్పటి నమ్మకం. ఇప్పుడు దైవం రాజకీయ శక్తుల అధీనంలో ఉన్నాడు నిస్సహాయుడై. అందుకే గణతంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చుకోవాలి. ‘మేకలనే బలి ఇస్తారు గానీ పులులను కాదు’ అన్నారు అంబేడ్కర్. బలికాకుండా ఉండాలంటే అంబేడ్కర్‌ను చదవాలి. అర్థంచేసుకోవాలి. చైతన్యవంతులు కావాలి!
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ డెరైక్టర్, అంబేడ్కర్ జీవిత చరిత్ర రచయిత్రి, ఫోన్: 040-27632525)