సీమాంధ్రకు పన్ను రాయితీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ ప్రతిపాదనలను కేబినెట్ తోసిపుచ్చింది. బిల్లులో మొత్తం 30 నుంచి 40 సవరణలు చేసినట్టు సమాచారం. సవరణలన్నీ అధికారికంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి చర్చల సారాంశాన్ని పార్లమెంట్‌కు నివేదించనుంది.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రతిపాదించింది. పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో ఉంచాలని సూచించింది. సీమాంధ్రకు పన్ను రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోనుంది. కొత్త రాజధానికి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కొత్తరాజధానికి సంబంధించి అన్ని అనుమతులు బిల్లు ద్వారా కేంద్రం ఆమోదించనుంది. 10 ఏళ్లపాటు సీమాంధ్ర-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉంటాయి. కాగా, షెడ్యూల్ ప్రకారమే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.