చదువులు.. చతికిలబడి!
మెదక్ : జిల్లాలో 46 మండలాలు ఉండగా, అందులో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు. మిగిలిన 43 మంది గెజిటెడ్ హెచ్ఎంలు తాత్కాలికంగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో సుమారు సగం మంది హెచ్ఎంలు ఇటీవల జరిగిన బదిలీల కౌన్సెలింగ్లో ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే వీరి స్థానాల్లో ఆగస్టు 1 నాటికి ఆయా మండలాల్లోని సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలకు ఎంఈఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు లోగడ ప్రకటించారు. ఈ మేరకు జూలై 23 నాటికి సీనియర్ ప్రధానోపాధ్యాయుల జాబితాను కూడా తెప్పించుకున్నారు. కానీ, నేటికీ కొత్తవారికి బాధ్యతలు అప్పజెప్పలేదు.
జంట బాధ్యతలతో పనిభారం
సిద్దిపేట డివిజన్లో నలుగురికి, సంగారెడ్డి డివిజన్లో 8 మంది, మెదక్ డివిజన్లో ఐదుగురు కొత్త ఎంఈఓలుగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. జోగిపేట డివిజన్లో కూడా పాత ఎంఈఓలు పనిచేసిన మండలాల్లో కొంతమంది సీనియర్ హెచ్ఎంలు బదిలీపై రావడంతో వారందరి వివరాలను డీఈఓ కార్యాలయానికి పంపినట్లు జోగిపేట డిప్యూటీ ఈఓ పోమ్యా నాయక్ తెలిపారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీ అయిన స్థానాల్లో పాతవారినే కొనసాగిస్తున్నారు. వారిలో చాలా మంది సుమారు 60 కి.మీ. దూరంలో గల స్కూళ్లకు హెచ్ఎంలుగా బదిలీ అయ్యారు.
వీరు ప్రస్తుతం అటు ప్రధానోపాధ్యాయ బాధ్యతలు, ఇటు ఎంఈఓ విధులు నిర్వర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల విద్యాశాఖకు ముఖ్య అధికారైన ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ లేక పాఠశాలల్లో విద్యావ్యవస్థ కుంటుపడుతుంది. గత నెలలో జరిగిన మండల కాంప్లెక్స్ సమావేశాల్లో పాత ఎంఈఓలు మొక్కుబడిగా పాల్గొన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ సమావేశాల్లో బాలల సంఘాలు, హరితహారం, ఫార్మేటీవ్-1లకు సంబంధించిన ప్రశ్నపత్రాల తయారీ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఇటు మండలాల్లో జీత భత్యాలు, మధ్యాహ్న భోజన బిల్లులు, మరోవైపు వారు పనిచేసే పాఠశాలల్లో అవే పనులు చేయాల్సి రావడంతో పనిభారం ఎక్కువవుతుందని వాపోతున్నారు.
అందని పాఠ్యపుస్తకాలు...
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లాకు 2,22,015 పుస్తకాలు అవసరం. ఇప్పటికి 19,16,137 మాత్రమే సరఫరా అయ్యాయి. సక్సెస్ స్కూళ్లలోని ఆంగ్ల మాధ్యమంలో 50 శాతం పుస్తకాలే పంపిణీ అయ్యాయి. మరోవైపు ఈ నెల 12న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లలో ‘ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జాబిషన్’లు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి ఎంఈఓలు లేకపోవడంతో వీటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.