భువీ, ఇషాంత్ లకు షాక్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన టీమిండియా జట్టును భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో టీమిండియా జట్టును ఎంపిక చేశారు. దాదాపు ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో ఆడిన జట్టునే ఎంపిక చేయగా, శ్రీలంకతో టీ 20 సిరీస్ కు ఎంపికైన యువ ఆల్ రౌండర్ పవన్ నేగీకి జట్టులో స్థానం కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే, సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు సెలక్టర్లు షాకిచ్చారు.
మరోవైపు జాతీయ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూసిన వెటరన్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కు మరోసారి చుక్కెదురైంది. ఇటీవల ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన ఇర్ఫాన్ తన స్థానంపై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ఈ భేటీకి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, వన్డే కెప్టెన్ ధోనీ, పలువురు బోర్డు సభ్యులు హాజరై సుదీర్ఘంగా చర్చించిన పిదప జట్టులోని సభ్యులను ప్రకటించారు.
ఆసియా కప్, వరల్డ్ టీ 20 లకు టీమిండియా జట్టు;
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, హర్బజన్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, పవన్ నేగి, షమీ అహ్మద్