44వేల పెళ్లి ప్రతిపాదనలు
పట్నా: బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ (26)కు 44 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. తమ ప్రాంతాల్లో సరైన రహదారులు లేకుంటే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు పంపాలని తేజస్వీ ఒక నంబరు ఇచ్చారు. దీంతో ఆ వాట్సాప్ నంబరుకు సమస్యలకు బదులు పెళ్లి ప్రతిపాదనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రియ, అనుపమ, మనీషా, కాంచన, దేవికా ఇలా 44 వేల మంది యువతులు ప్రతిపాదనలు పంపారు.
అంతేకాదు.. వీరంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంపారు. శరీర కొలతలు, రంగు, ఎత్తు తదితర సమాచారంతో మెసేజ్‌లు పంపారు. వాట్సాప్ నంబర్ తేజస్వీదిగా భావించి యువతులందరూ ఇలా పెళ్లి ప్రతిపాదనలు పంపారని అధికారులు తెలిపారు. ‘నాకు పెళ్లి అయి ఉంటే చాలా ఇబ్బందుల్లో పడేవాడిని, పెళ్లి కానందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని’ తేజస్వీ చమత్కరించారు. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు క్రికెటర్‌గా రాణించారు. తేజస్వితోపాటు లాలూ మరో కొడుకు, ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్‌కు కూడా ఇంకా వివాహం కాలేదు.