Telangana Association of New Zealand
-
టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
ఆక్లండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆక్లండ్ విమానాశ్రయంలో టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగన్ వడ్నాల తేజావత్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని తేజావత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తేజావత్ మాట్లాడుతూ... ఢిల్లీలో ఆయన నిర్వహించే బాధ్యతల గురించి ప్రస్తవించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు సీఎం పట్టుదలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దంపతులను టాంజ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం టాంజ్ సభ్యులను తేజావత్ సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమానికి టాంజ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు, సభ్యులు దయానంద్ కటకం, శ్రీనివాస్, శీసుత, విజేత, సుశాంతి, అరుణ్ ప్రకాశ్, విజయ్, గ్రీష్మ, సునీతతో పాటు టీఆర్ఎస్ పార్టీ న్యూజిలాండ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. -
ఆక్లాండ్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో మంగళవారం ఆక్లాండ్‌లో తెలుగు ప్రజలు వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆక్లాండ్ లోని పాపకూర గణేష్ ఆలయంలో టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో దాదాపు మూడు వేల మంది భక్తులు పాల్గొనడంతో సందడి వాతావారణం కనిపించింది. ఆలయ పూజారి చంద్రు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు టీఏఎన్జెడ్ సభ్యులు మహా ప్రసాదం అందజేశారు. టీఏఎన్జెడ్ అనంతరం నిమజ్జనం వేడుకలో చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా అందరూ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కె, కార్యదర్శి దయాకర్ బాచు, ఉపాధ్యక్షుడు రామ్ మోహన్ దంతాల, కార్యనిర్వాహక సభ్యులు వి.సునీత, కె.లక్ష్మీ, సౌజన్య బాచు, అరుణ పానుగంటి, ఇతర కీలకసభ్యులు, స్థానిక వాలంటీర్లు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. -
న్యూజీలాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన న్యూజీలాండ్ ఇండియన్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీకు భాను, ప్రకాష్ బీరాదర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కల్యాణ్ రావు కాసుగంటి, ఉపాధ్యక్షుడు ఉమా సల్వాజి, జనరల్ సెక్రటరీ బి.దయాకర్, జాయింట్ సెక్రటరీ యాచమనేని జ్యోతి ప్రజ్వలణలో పాల్గొన్నారు. వీరితో పాటు టీఏఎన్జెడ్ ముఖ్య సభ్యులు, భారతీయ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, ఆక్లాండ్ మలయాళి సమాజ్, సాయిబాబా సంస్థాన్, న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు, ఇతర ప్రముఖులు కలిసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టీఏఎన్జెడ్ క్యాలెంజర్ ని ఆవిష్కరించారు. మహిళలు బతుకమ్మ ఆడి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను గణేశుని ప్రార్థనతో ప్రారంభించారు. చిన్నారి గ్రీష్మ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చక్కగా ఆలపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి విచ్చేసిన అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు శ్రిసుత నాంపల్లి, మురళీధర్ వ్యాక్యాతలుగా వ్యవహరించారు. కల్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ.. టీఏఎన్జెడ్ విజన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్పాన్సర్స్ కి, ఇతర సభ్యులకు జనరల్ సెక్రటరీ దయాకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సేవలను, సాయుధ పోరాటం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను కొనియాడారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తెలంగాణపై అభిమానంతో ఇక్కడికి వచ్చారని వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల అన్నారు. జాతీయ గీతం జనగనమణ ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముగించారు.