Telangana Minority Welfare Department
-
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హజ్‌హౌస్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో జరిగిన డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం దేశంలో రూ. 4వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 2 వేల కోట్లు కేటాయించి మైనారిటీ సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. నిధులను పూర్తిగా వినియోగించి మైనారిటీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. మైనారిటీ సంక్షేమానికి షాదీముబారక్, మసీదుల నిర్మాణం, మరమ్మతులు, ఇమాంలకు పారితోషికం, స్వయం ఉపాధి పథకాలు, మైనారిటీ గురుకులాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. డైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద ప్రభుత్వ సబ్సిడీతో మైనారిటీ యువతకు కార్లను అందజేసి వారి జీవనోపాధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సౌజన్యంతో కార్ల వితర ణ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతిని వినియోగించుకొని వారి జీవితాలను మెరుగుపర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. మైనారిటీ సంక్షేమ పథకాల అమల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శం... దేశంలోనే మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మైనారిటీ విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మైనారిటీ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను దిశా నిర్ధేశం చేసుకోవాలని సూచించారు. నాంపల్లి శాసన సభ్యుడు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. డ్రైవర్ ఎంపవర్ మెంట్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి పెద్ద సంఖ్యలో మైనారిటీలకు అందేలా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖాధికారులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్సారీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీమ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఏక్కా, ఎంఎఫ్సీ ఎండీ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 67 మంది మైనారిటీ యువకులకు కార్లను పంపిణీ చేశారు. -
ఉర్దూ గ్రేడ్–1,2 పోస్టుల భర్తీపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: ఉర్దూ అధికారుల గ్రేడ్–2 పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల రోస్టర్‌ను ప్రకటించకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా రోస్టర్ ప్రకటించకపోవడం తగదని అభిప్రాయపడింది. ఇప్పటికే గ్రేడ్–2 పోస్టుల ఫలితాలు వెలువడినందున ఎంపికైన వారిని ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పిటిషనర్‌ను ఆదేశించారు. తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధీనంలోని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మార్చి 28న గ్రేడ్–1, గ్రేడ్–2లకు చెందిన 60 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయకుండానే భర్తీ ప్రకటన చేశారని, ఇది సర్వీస్ నిబంధనల్లోని 22కు విరుద్ధమంటూ మహ్మద్ ముత్తాబి అలీఖాన్తోపాటుగా మరోవ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి విచారించారు. నేరుగా ఉర్దూ అకాడమీ ఉద్యోగ భర్తీ ప్రకటన జారీ చేయడం చెల్లదని, ఉద్యోగ నియామక నిబంధనల్లోని 22వ సర్వీస్ రూల్ ప్రకారం రోస్టర్ విధానాన్ని అమలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఉర్దూ గురుకులాలకు మంగళం
5 పాఠశాలలు, 2 కాలేజీల్లో అడ్మిషన్ల నిలిపివేత సాక్షి, హైదరాబాద్: మైనారిటీ ఉర్దూ మాధ్యమం గురుకులాలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్ధల సోసైటీ (టెమ్రీస్) మంగళం పాడింది. ఈ విద్యా సంవత్సరానికి వీటిల్లో ఉర్దూ మీడియం ప్రవేశాలను నిలిపివేసింది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రవేశాలు కల్పించింది. దీంతో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న 5 ఉర్దూ గురుకుల పాఠశాలలు... రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న రెండు అప్‌గ్రేడ్ ఉర్దూ గురుకుల కళాశాలు ఇంగ్లిష్ మీడియంగా మారిపోయాయి. ఉర్దూలో నాణ్యమైన విద్య కోసం... ఉర్దూలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 5 ఉర్దూ మీడియం గురుకులాలను ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతలను ఏపీ గురుకుల విద్యాసంస్ధల సోసైటీకి అప్పగించింది. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో బాలురకు, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో బాలికలకు ఉర్దూ గురుకులాలను ఏర్పాటు చేసింది. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించింది. కాగా, 1997లో ప్రభుత్వం హైదరాబాద్, నిజామాబాద్ల్లోని రెండు గురుకుల పాఠశాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. తెలంగాణలోని దక్షిణ ప్రాంతంలో గల ఐదు జిల్లాల విద్యార్థులకు హైదరాబాద్ కులీ కుతుబ్‌షా ఉర్దూ గురుకుల జూనియర్ కాలేజీ (బాయ్స్)లో, ఉత్తర ప్రాంతానికి చెందిన ఐదు జిల్లాల విద్యార్ధులకు నిజామాబాద్ ఉర్దూ గురుకుల కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తూ వస్తున్నారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మరో ఏడు మైనారిటీ ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ప్రారంభించారు. దీంతో మైనారిటీ గురుకులాల సంఖ్య 14కు పెరిగింది. టెమ్రీస్లో విలీనం... రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం పెద్దఎత్తున గురుకులాలు ప్రారంభించడంతో అన్నింటినీ ఒకే గోడుకు కిందకి తేచ్చేందుకు... తెలంగాణ గురుకుల విద్యా సంస్ధలకు సంబంధించిన 12 మైనారిటీ గురుకులాలు, రెండు అప్‌గ్రేడ్ మైనారిటీ జూనియర్ కాలేజీలను టెమ్రీస్కి బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులిచ్చింది. కాగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ 2017–18 సంవత్సరానికి ఉర్దూ మీడియం అడ్మిషన్లను నిలిపివేయాలని టెమ్రీస్ కార్యదర్శి షపీయుల్లా మౌఖిక ఆదేశాలిచ్చారు. దీనిపై తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసొసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ దీనిపై వెంటనే నివేదిక సమర్పించాలని టెమ్రీస్కు మెమోలు ఇచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మైనర్ లాంగ్వేజీ మీడియంను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ మసూద్ అహ్మద్ ఆరోపించారు.