కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు
దేశ బహిష్కరణ చేస్తామని కువైట్ హెచ్చరిక
తెలుగువారిని అప్రమత్తం చేస్తున్న సంస్థలు
మోర్తాడ్: నూతన సంవత్సర వేడుకలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 2015కు వీడ్కోలు చెబుతూ.. 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాలు నిర్వహించరాదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గతంలో ఎప్పుడు కూడా వేడుకలపై ఆంక్షలను విధించలేదు. ఈసారి మాత్రం ఆంక్షలను విధిస్తూ ముందస్తుగానే ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీల్లో పార్టీలు నిర్వహించడం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారిపై కువైట్ పోలీసులు నిఘా ఉంచనున్నారు. హోటళ్లు, నివాస ప్రాంతాలు, కంపెనీల కార్మికుల క్యాంపులు, ఫ్లాట్లు, రెస్టారెంట్లపై పోలీసులు కన్ను వేశారు.
కువైట్ పౌరులకు కఠినశిక్ష, భారీ జరిమానా, విదేశీయులైతే దేశ బహిష్కరణ విధించను న్నారు. ఇప్పటికే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారని బెంగళూర్, హైదరాబాద్‌లకు చెందిన ఏడుగురిని అక్కడి ప్రభుత్వం పంపించివేసింది. ఈ నేపథ్యంలో తెలుగు స్వచ్ఛంద సంస్థలు అక్కడి తెలుగు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. వేడుకలకు దూరంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి.