'శైలజ'కు గోల్డెన్ ఛాన్స్
చెన్నై: 'నేను శైలజ' ఫేం కీర్తి సురేశ్ పుట్టినరోజు నాడు గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అగ్రహీరో సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. విలక్షణ నటుడు సూర్యతో ప్రాజెక్టు ఓకే చేసింది. విఘ్నేశ్శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థిల్లర్ 'తానా సేర్న్ద కూటం' సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నారు.
ఇటీవల విడుదలైన 'రెమో' సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా కీర్తి నటించింది. విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా 'భైరవ', తెలుగులో 'నేను లోకల్' సినిమాలో నాని సరసన ఆమె నటిస్తోంది. రామ్, కీర్తి జంటగా నటించిన 'నేను శైలజ' సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే.