సాహసం సమ్మోహనం!
ఫొటోలు తీయడం మజా రేకెత్తించే పని. ‘థ్రిల్’ అనిపించే ఫొటోలను తీయడం ‘దిల్’కు ఖుషీ అనిపించే పని. డైవింగ్, సర్ఫింగ్, స్టంట్స్,స్నో బోర్డింగ్... ఇలా ‘థ్రిల్’ అనిపించే ఫొటోలకు ‘రెడ్ బుల్ ఇల్యుమ్’ చిరునామాగా మారింది. యాక్షన్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోని ఆకట్టుకునే ‘అంశ’ను ప్రపంచానికి చాటడానికి ‘రెడ్ బుల్ ఇల్యుమ్’ అడ్వెంచర్ స్పోర్ట్స్, యాక్షన్ విభాగాలలో ఛాయచిత్రాల పోటీలు నిర్వహిస్తోంది. రెడ్ బుల్ ఇల్యుమ్ ఫొటో కాంటెస్ట్-2013కి మొత్తం 28,000 ఇమేజెస్ వచ్చాయి. రెప్పపాటులో తీసిన ఈ ఛాయాచిత్రాల్లో ఫొటోగ్రాఫర్ల సృజన, పనితనం స్పష్టంగా కనిపిస్తుంది.
పోటీకి వచ్చిన ఫొటోల్లో బహుమతి గెలుచుకున్నవి, గెలుచుకోనివి అనే విభజనను పక్కన పెడితే ప్రతి ఫొటో కూడా ‘శభాష్’ అనిపించేలా ఉంది. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల హాంకాంగ్‌లో ఘనంగా జరిగింది.
‘‘మనకు టాలెండెడ్ ఫొటోగ్రాఫర్లతో పాటు గిఫ్టెడ్ ఫొటోగ్రాఫర్లు కూడ ఉన్నారు’’ అన్నారు సీనియర్ ఫొటోజర్నలిస్ట్ జిమ్ విల్సన్. యాభై మంది న్యాయనిర్ణేతలలో విల్సన్ కూడా ఒకరు.
‘‘ఇవి కేవలం యాక్షన్ ఫొటోలు మాత్రమే అనుకోనక్కర్లేదు. సాంకేతిక, కళాత్మక విలువలు కూడా అందులో ఉన్నాయి’’ అంటాడు ఆయన.
‘‘మంచు వర్షంలో ఫొటో తీయడం తేలికైన విషయమేమీ కాదు’’ అంటున్న ఫొటోగ్రాఫర్ క్రిస్ బకార్డ్ తన పనిలోని సాధకబాధకాలను గురించి ఆసక్తిగా వివరించగలరు.
క్రిస్‌కు మాత్రమే కాదు... సాహసం ఉట్టిపడే ఫొటోలను తీసిన ప్రతి ఫొటోగ్రాఫర్‌కి విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి!