తరలిపోతున్న ఎర్రసంపద..!
ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు.. నిత్యం ఎర్రచందనాన్ని భారీగా తరలిస్తున్నారు. రోజూ టన్నుల కొద్దీ ఎర్రసంపద పట్టుపడుతుండడమే ఇందుకు తార్కాణం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే రహదారుల వెంబడి భారీ బందోబస్తు ఉంటుంది. దీంతో అక్రమరవాణాకు వీలుపడదని గ్రహించిన స్మగ్లర్లు ఇప్పటి నుంచే బరితెగిస్తున్నారు. రెండు నెలల్లో వీలైనంత అక్రమంగా తరలించి సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అక్రమరవాణాకు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. అక్రమరవాణాను అడ్డుకోవడం అధికార యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది.
చిత్తూరు ,పుత్తూరు : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా నిత్యకృత్యమైపోయింది. అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా, ప్రతిరోజు టన్నుల కొందీ ఎర్రదుంగలు పట్టుబడుతూనే ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ, పోలీసులు నిత్యం వెయ్యికళ్లతో తనిఖీలు చేస్తున్నా స్మగ్లర్లు బేఖాతర్ చేస్తున్నారు. మరోవైపు స్మగ్లర్ల బరితెగింపు పతాకస్థాయికి చేరింది. ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం అధికారులకు సవాల్‌గా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బరితెగిస్తున్న స్మగ్లర్లు...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. అధికార వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బును అడ్డుకునేందుకు రహదారుల వెంబడి చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. నిత్యం పహారా ఉండడంతో ఎర్రచందనం అక్రమ రవాణా దుర్లభం. దీంతో స్మగ్లర్లు డిసెంబర్, జనవరిలోనే వీలైనంత వరకు అక్రమంగా తరలించేందుకు ఎంతటికైనా బరితెగిస్తున్నారు. ఈ క్రమంలో దాడులకు సైతం వెనుకాడడం లేదు. అరుదైన ఎర్రచందనం రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటకుండా స్మగ్లర్ల పీచమణచాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పట్టుబడుతున్న ఎర్రచందనం..
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా దాడులు చేస్తున్నా స్మగ్లర్లు చెలరేగుతూ నే ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 14 చోట్ల టన్ను ల కొద్దీ ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ అక్రమ రవాణాను పూర్తి అడ్డుకో లేకపోతున్నారనే మాటలు వినబడుతున్నాయి.
♦ ఒక్క పుత్తూరు అటవీశాఖ అధికా>రులే ఈ నెలలో సుమారు రెండు టన్నుల ఎర్రచంద నం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న 64, 26న 77 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
♦ భాకరాపేట పరిధిలో ఈ నెల 23న 58 దుంగలు, 24న ఏకంగా రూ.కోటి విలువచేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు.
♦ వడమాలపేట పరిధిలో ఈ నెల 22న 95, 12న పూడి సమీపంలో 26 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
♦ శేషాచలం పరిధిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఈ నెల 1న 58, 12న 10 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో స్మగ్లర్లు సిబ్బందిపై దాడికి కూడా పాల్పడ్డారు.
♦ ఇవేకాకుండా జిల్లాలోని ఏర్పేడులో 14 దుంగలు, యర్రావారిపాళెంలో 31, పిచ్చాటూరులో, చంద్రగిరిలో 11, తొట్టంబేడులో రూ.2 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.