తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓల జేఏసీ సూచించింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ కె.రాజేందర్రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మణ్, ఎల్.రామ్మోహన్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, వారి భద్రతకు ఇక్కడి ఉద్యోగులదే బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామని, తెలంగాణ ప్రక్రియను అడ్డుకునే వారికి ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ధర్నాలో ఉద్యోగ జేఏసీ నాయకులు మల్లారెడ్డి, కైలాసం, వెంకటేశ్వర్లు, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.