నిరుపయోగంగా మొల్ల హరిత రెస్టారెంట్
గోపవరం : మండల కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి మొల్ల హరిత రెస్టారెంట్ ఏడాదన్నర కాలం నుంచి నిరుపయోగంగా ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొల్ల జన్మస్థలమైన గోపవరంను అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట రూ.1.17 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఆ నిధులతో జాతీయ రహదారి పక్కనే మొల్ల పేరుతో హరిత రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొల్ల అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. హరిత రెస్టారెంట్‌ను స్వయంగా పర్యాటకశాఖ కొనసాగిస్తూ వచ్చారు. 2015 డిసెంబర్లో విశాఖపట్నంకు చెందిన కాంట్రాక్టర్ టెండర్ ద్వారా హరిత రెస్టారెంట్‌ను లీజుకు తీసుకోవడం జరిగింది. దీంతో ఉన్నఫలంగా గతేడాది జనవరిలో పర్యాటకశాఖ హోటల్‌ను ఖాళీ చేశారు. అయితే టెండర్ ద్వారా లీజుకు దక్కించుకున్నవారు ఇప్పటి వరకూ రాకపోవడంతో హరిత హోటల్ నిరుపయోగంగా ఉంది. ఏ కారణం చేత లీజుకు తీసుకున్నవారు హోటల్‌ను ప్రారంభించలేదన్న దిశగా పర్యాటకశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెస్టారెంట్ మూతపడే ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాన్ని నిరుపయోగంగా వదిలివేయడంతో క్రమేనా శిథిలావస్థకు చేరుకునే అవకాశం లేకపోలేదు. గతంలో ప్రవేశపెట్టిన టెండర్‌ను రద్దు చేసి తిరిగి టెండర్ ద్వారా హరిత హోటల్‌ను లీజుకు ఇచ్చి కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కాగా ఇదే అంశంపై ఇటీవల మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ హోటల్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మొల్ల జన్మస్థలమైన గోపవరంను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.