ట్రాక్టర్ల ఎగుమతుల్లో సొనాలికా టాప్..
ఈ ఏడాది లక్ష్యం 13,000 యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్ల ఎగుమతుల్లో జూలైలో సొనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ టాప్‌లో నిలిచింది. గత నెలలో 1,534 యూనిట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్-జూలై కాలంలో 24 శాతం వృద్ధితో మొత్తం 4,075 ట్రాక్టర్ల ఎగుమతులతో మూడో స్థానంలో ఉంది. చైనా, యూఎస్ మార్కెట్లు ఇస్తున్న బూస్ట్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,000 యూనిట్లతో టాప్-1 ఎగుమతిదారుగా నిలవాలని లక్ష్యంగా చేసుకుంది.
2015-16లో టాప్-4 ఎక్స్‌పోర్టర్‌గా కంపెనీ ఉంది. జూలై స్థానాన్ని మిగిలిన ఏడాదంతా కొనసాగిస్తామని సొనాలికా ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రెసిడెంట్ గౌరవ్ సక్సేనా తెలిపారు. కంపెనీ ఎగుమతుల్లో ఆఫ్రికా మార్కెట్ 30 శాతం, ఆసియా 25 శాతం, మిగిలినది యూరప్, లాటిన్ అమెరికా విపణి కైవసం చేసుకున్నాయని చెప్పారు. ట్రాక్టర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం జూలైలో టఫే 1,256 యూనిట్లు, జాన్ డీరే 1,173, మహీంద్రా 1,100, న్యూ హోల్లాండ్ 720, ఎస్కార్ట్స్ 82 యూనిట్ల ఎగుమతులు నమోదు చేశాయి.