ఏసీబీ అధికారులకు చిక్కిన ట్రాన్స్కో ఏఈ
విజయనగరం క్రైమ్/మక్కువ: ఎట్టకేలకు ట్రాన్స్కో ఏఈ పోలాకి శాంతారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. నాలుగు రోజులపాటు పరారీలో ఉన్న ఏఈను విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ మంజురుకు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ములక్కాయవలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు నుంచి ఏఈ రూ.60వేలు డిమాండ్ చేయగా రూ. 20వేలు చెల్లించాడు. ఆగస్టు 27న సాయంత్రం మిగిలిన బ్యాలెన్స్ రూ.40వేలు కారులో ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈపై దాడి చేశారు.
ఆ సమయంలో అధికారులను గుర్తించిన ఏఈ.. తన కారును వేగంగా పొలాల్లోకి నడిపాడు. ఆయనను వెంబడించిన సీఐను ఢీకొట్టి గాయాలపాలుచేశాడు. పొలాల్లోనే కారును విడిచిపెట్టి పరారయ్యాడు. ఆయన కారును ఏసీబి అధికారులు సీజ్ చేసి, మక్కువ పోలీసు స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న ఏఈ కదలికలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. ఏఈ సమక్షంలోనే విజయనగరంలో ఆయన ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. 350 గ్రాముల బంగారం, సుమారు రెండు కిలోల వెండి, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అద్దె ఇంటిలోనూ సోదాలు
మక్కువ ఎస్సీకాలనీ సమీపంలో ఏఈ నివసిస్తున్న అద్దె ఇంటిలో ఏసీబీ సీఐ శ్రీనివాసరావు, తన సిబ్బందితో సోదాలు జరిపారు. ఏఈ కుటంబసభ్యుల సమక్షంలో వివిధ పత్రాలను పరిశీలించారు. విలువైన డాక్యుమెంట్లు ఏమైనా దొరికాయా? లేదా? అన్న విషయాన్ని ఏసీబీ అధికారులు వెల్లడించలేదు.