Trendy farming
-
కో వర్కింగ్... ఇపుడిదే కింగ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ బడ్జెట్లో కంపెనీని ఏర్పాటు చేశారా? అయినప్పటికీ అన్ని సౌకర్యాలతో ట్రెండీ ఆఫీస్ కావాలా? మీలాంటి వారికి కో-వర్కింగ్ స్పేస్ చక్కని పరిష్కారం. స్టార్టప్స్ మాత్రమే కాదు, పెద్ద కంపెనీల కార్యకలాపాలకూ ఇవి చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగుల్లో 46 శాతం మిలీనియల్స్ కావడం.. వీరు టెక్ స్మార్ట్ ఆఫీసులను కోరుకుంటుండడంతో భారత్‌లో ఇప్పుడు కో-వర్కింగ్ స్పేస్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్టప్స్, చిన్న, మధ్యతరహా కంపెనీలు అందుబాటు ధరలో లభించే అద్దె కార్యాలయాల వైపు మొగ్గు చూపడం, అలాగే కార్పొరేట్ కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణకు వీటిని వేదికలుగా చేసుకుంటున్నాయి. భాగ్యనగరిలోనూ కో-వర్కింగ్ కల్చర్ ఊపందుకుంది. హైదరాబాద్‌లో దాదాపు 70 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. గంటల వ్యవధి కోసం సైతం.. అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి చార్జీలు ఉంటాయి. సీటింగ్, కంప్యూటర్ సిస్టమ్స్, ఇంటర్నెట్, కెఫెటేరియా, జిమ్, లైబ్రరీ, ప్లే ఏరియా, గేమింగ్ జోన్, మీటింగ్ రూమ్స్, రిక్రియేషనల్ స్పేస్, కాంప్లిమెంటరీ టీ/కాఫీ, ప్రింటర్, టెక్నికల్ సపోర్ట్ వంటి హంగులనుబట్టి చార్జీలు ఆధారపడతాయి. గంటల వ్యవధి కోసం సైతం కో-వర్కింగ్ స్పేస్‌ను వాడుకోవచ్చు. రోజుకు రూ.500 చార్జీ చేస్తున్న కంపెనీలూ ఉన్నాయి. అలాగే నెలకు డెస్క్ వాడుకున్నందుకు కనీస చార్జీ రూ.5 వేలు ఉంటోంది. లీజుకు కార్యాలయాన్ని తీసుకోవడం, సౌకర్యాల కోసం ముందస్తు పెట్టుబడి పెట్టే అవసరం లేకపోవడం కంపెనీలకు కలిసి వచ్చే అంశం. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అద్దె కార్యాలయంలోకి ఎప్పుడైనా ఎంట్రీ, ఎగ్జిట్ అవొచ్చు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, స్టార్‌బక్స్, ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజ సంస్థలూ కో-వర్కింగ్ స్పేస్ లొకేషన్లలో కార్యాలయాలను సాగిస్తుండడం విశేషం. పోటీపడుతున్న కంపెనీలు.. వీవర్క్, 91స్ప్రింగ్‌బోర్డ్, గోహైవ్, గోవర్క్, ఆఫిస్, ఐస్ప్రౌట్.. ఇలా దేశంలో 300లకుపైగా కంపెనీలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. విభిన్న సేవలతో క్లయింట్లను ఆకర్శించడమే కాదు, విస్తరణలోనూ నువ్వా నేనా అని అంటున్నాయి. చిన్న నగరాల్లోనూ అడుగుపెడుతున్నాయి. ఈ రంగంలో 2020 నాటికి రూ.2,800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని మైహెచ్‌క్యూ అంచనా వేస్తోంది. అలాగే కో-వర్కింగ్ కేంద్రాల్లో వివిధ కంపెనీలకు చెందిన 1.3 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తారని జోస్యం చెబుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో వర్క్‌స్పేస్ ఆపరేటర్లు 2019లో 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని లీజుకు తీసుకుంటారని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ చెబుతోంది. అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్‌లో వర్క్‌స్పేస్ కంపెనీలు తీసుకునే లీజు స్థలం 18-20 శాతముంటుందట. 2018లో ఇది 14 శాతం వాటాతో 68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కైవసం చేసుకున్నాయి. సంప్రదాయ లీజు విధానంతో పోలిస్తే రెండేళ్లలో కో-వర్కింగ్ స్పేస్ వాటాయే అధికంగా ఉంటుందని ఐస్ప్రౌట్ సీఈవో సుందరి పాటిబండ్ల సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కన్సాలిడేషన్ దిశగా.. ఈ రంగంలో కన్సాలిడేషన్ వచ్చే ఏడాది నుంచి జరుగుతుందని కొలియర్స్ అంటోంది. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన పెద్ద కంపెనీలు ఈ రంగంలోని చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తాయి. ఇప్పటికే ఇన్నోవ్-8ను జూలైలో ఓయో దక్కించుకుంది. కన్సాలిడేషన్‌తో విభిన్న ధరల శ్రేణిలో క్లయింట్లకు సేవలు అందించేందుకు పెద్ద సంస్థలకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ రంగ కంపెనీల చేతుల్లో మొత్తం 1.7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం ఉంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇది 3.5 శాతం. క్లయింట్ల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండడంతో కంపెనీలు భారీ భవంతులను లీజుకు తీసుకుని వర్క్‌స్పేస్ సైట్లుగా తీర్చిదిద్దుతున్నాయి. వర్క్‌స్పేస్ సైట్ల సగటు విస్తీర్ణం రెండేళ్లలో 40 శాతం అధికమై 55,000 చదరపు అడుగులకు చేరుకుంది. ఓయో వర్క్‌స్పేసెస్ ఇటీవలే హైదరాబాద్‌లో 700 సీట్లకుపైగా సామర్థ్యమున్న కేంద్రాన్ని ప్రారంభించింది. -
మట్టి అంటని ‘మెగా’ సేద్యం!
- రూ. 5 కోట్ల పెట్టుబడితో దేశంలోనే తొలి హైడ్రోపోనిక్ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు - మట్టి కుండీల్లో కొబ్బరి పొట్టు, ద్రవరూప ఎరువులతో అత్యాధునిక సేద్యం - 16 పాలీహౌస్‌లలో భారీ ఎత్తున చెర్రీ టొమాటోల సాగు - శుద్ధి చేసిన నీటితో నాణ్యమైన దిగుబడి - పెద్ద నగరాల్లోని మాల్స్‌లో అమ్మకాలు.. కిలో ధర రూ. 400 - దుబాయ్‌కీ ఎగుమతి చేస్తున్న వైనం - హైదరాబాద్ యువ మహిళా రైతు విజయగాథ ‘ధైర్యే.. సాహసే.. లక్ష్మీ..’ అన్నారు.పాయల్ రైనా ఘోష్ ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.ఈ విజయ మంత్రాన్ని ఆమె ఎంతగా వంటపట్టించుకున్నారో తెలుసుకోవాలంటే.. ఆమె సృష్టించిన అత్యాధునిక హైడ్రోపోనిక్ పాలీహౌస్‌ల వ్యవసాయ క్షేత్రాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే చాలు. సంప్రదాయ వ్యవసాయం బొత్తిగా ఎరుగని కశ్మీరీ పండిట్ కుటుంబంలో.. అందునా హైదరాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల కావచ్చు.. చెంచాడు కూడా మట్టి అవసరం లేని హైడ్రోపోనిక్ సేద్య పద్ధతిని పాయల్ ఎంచుకున్నారు! అంతేకాదు.. సంపన్నులు ఇష్టంగా తినే తియ్యటి చెర్రీ టొమోటోలను హైదరాబాద్ సమీపంలో భారీ పెట్టుబడితో భేషుగ్గా పండిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 16 పాలీహౌస్‌లలో సాగు చేస్తూ.. మహిళా రైతుగా ఆశ్చర్యకరమైన విజయాలను నమోదు చేస్తున్నారు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ సేద్య రీతిపై ప్రత్యేక కథనం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. పంటకు ఆధారం మట్టే. కానీ, చిటికెడు మట్టిని కూడా ఉపయోగించకుండా పంటలు పండించేదే ‘హైడ్రోపోనిక్’ పద్ధతి. మట్టికి బదులుగా కొబ్బరి పొట్టును కుండీల్లో నింపి.. డ్రిప్ ద్వారా నీటితోపాటు ద్రవరూప ఎరువులను కలగలిపి నిరంతరం అందించడం ఈ సేద్య పద్ధతి ప్రత్యేకత. దేశవిదేశాల్లో ఇంటిపంటల్లో హైడ్రోపోనిక్ పద్ధతిని వాడటం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌కు చెందిన మహిళా రైతు పాయల్ రైనా ఘోష్ భారీ స్థాయిలో ధైర్యంగా పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్ వ్యవసాయం చేపట్టడం అభినందనీయం. వినూత్న పద్ధతిలో పాలీహౌస్‌ల నిర్మాణం రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం సలార్పుర్ గ్రామపరిధిలో ‘స్పర్శ్ బయో’ పేరిట అత్యాధునిక హంగులతో కూడిన వ్యవసాయ క్షేత్రాన్ని పాయల్ నిర్మించారు. రూ.5 కోట్ల పెట్టుబడితో 25 ఎకరాల ఆవరణలో 16 పాలీహౌస్‌లు నిర్మించారు. వీటి నికర విస్తీర్ణం 30 వేల చదరపు మీటర్లు. వీటిలో కొన్నిటిని సంప్రదాయ ఆకృతుల్లోనే నిర్మించారు. మరికొన్నిటిని దక్కన్ పీఠభూమి వేడి వాతావరణానికి తగినట్టుగా ఆకృతిని మార్చి, 10% తక్కువ ఖర్చుతో హైబ్రిడ్ పాలీహౌస్‌లను నిర్మించారు. పాలీహౌస్లో నుంచి వేడి గాలి త్వరగా బయటకు పంపడానికి గాలికి తిరిగే టర్బో వెంటిలేటర్లను అమర్చారు. పాలీహౌస్‌కు రెండు వైపులా 2.8 మీటర్ల ఎత్తున నైలాన్ 40 మెష్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాలీహౌస్‌లలో 35 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత పెరగకుండా, పగటి పూట 5 నిమిషాలకోసారి నీటి తుంపరలను ఆటోమేటిక్‌గా వెదజల్లే ఏర్పాట్లు చేశారు. మట్టి కుండీలు.. కొబ్బరిపొట్టు.. ప్రత్యేకంగా తయారు చేయించిన అడుగు ఎత్తుండే ఎర్రమట్టి కుండీలో శుద్ధిచేసిన 700 గ్రాముల కొబ్బరి పొట్టును నింపుతారు. స్విట్జర్లాండ్ నుంచి తెప్పించిన హైబ్రిడ్ విత్తనాలతో నారుపోసి, 28 రోజుల చెర్రీ టొమాటో మొక్క నాటుతున్నారు. సాళ్ల మధ్య 4.5 అడుగులు, మొక్కల మధ్య 16 అంగుళాల దూరం ఉంచుతున్నారు. ఈ కుండీలు పక్కకు పడిపోకుండా ఇనుప ఫ్రేమ్‌పై అమర్చి, ఎయిరో డ్రిప్పర్ ద్వారా తగుమాత్రంగా నీటిని ఇస్తున్నారు. సాగు నీటిగా శుద్ధ జలాలు రోజుకు 3 దఫాలు (మొత్తం 10 నిమిషాలపాటు) ఒక్కో మొక్కకు రోజుకు లీటరుకు పైగా శుద్ధమైన నీటిని ఇస్తున్నారు. భూగర్భ జలాలను బోర్లతో తోడి రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసి, ఆ నీటిని చెర్రీ టొమాటో మొక్కలకు ఇస్తున్నారు. సాధారణంగా పాలీహౌస్‌లలో మొక్కలకు ఇచ్చే నీరు 95% వృథా అవుతుందని, తమ వద్ద 5% మాత్రమేనని పాయల్ తెలిపారు. అందువల్లే కరువు పీడిత ప్రాంతంలోనూ నిశ్చింతగా 35 వేల లీటర్ల ఆర్.ఓ. నీటిని పంటకు ఇస్తున్నామన్నారు. చెర్రీ టొమాటో తీగ జాతి మొక్క. తాడు ఆసరాతో 12 అడుగుల పొడవు∙పెరుగుతున్నది. 5,6 అడుగుల ఎత్తు పెరిగే వరకు ఆసరా తాడును నిలువుగానే కట్టి ఉంచుతారు. ఆ తర్వాత పక్కకు ఏటవాలుగా వంచి కట్టేస్తారు. ఎంత పొడవు పెరిగినా కాయలు చేతికి అందేంత ఎత్తులో ఉంచడం కోసమే ఇలా చేస్తున్నామని పాయల్ వివరించారు. నాటిన రెండు నెలలకు కాపుకొస్తాయి. ఆ తర్వాత 3–4 నెలల పాటు మొక్కకు 3–4 కిలోల చెర్రీ టొమాటోల దిగుబడినిస్తున్నాయని పాయల్ వివరించారు. ప్రతి పాలీహౌస్లోనూ చెర్రీ టొమాటో మొక్కలనే ఏక పంటగా సాగు చేస్తున్నారు. రసాయనిక ద్రవ రూప ఎరువులను నీటితో పాటే మొక్కలకు అందిస్తున్నారు. పురుగుల బెడదను తగ్గించడానికి లింగాకర్షక బుట్టలతోపాటు జిగురు పూసిన పసుపు, నీలి అట్టలను వాడుతున్నారు. అవసరమైనప్పుడు తగుమాత్రంగా రసాయనిక పురుగుమందులు వాడుతున్నామని పాయల్ చెప్పారు. ప్రతి పాలీహౌస్లోనూ చెర్రీ టొమాటో మొక్కలనే ఏక పంటగా సాగు చేస్తున్నారు. రసాయనిక ద్రవ రూప ఎరువులను నీటితో పాటే మొక్కలకు అందిస్తున్నారు. అయితే, సుస్థిర సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడంపై దృష్టిపెడితే సుస్థిర వ్యవసాయానికి పాయల్ మార్గదర్శకురాలిగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఆశిద్దాం. వివరాలకు: ఫామ్ మేనేజర్ రాకేష్ గౌడ్ 91333 00621 – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి, సాక్షి ఫొటో జర్నలిస్టు నాణ్యతలో రాజీ లేదు... చెర్రీ టొమాటోలో రోజుకు 500 కిలోల దిగుబడి తీస్తున్నాం. కోసిన 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. రైళ్ల ద్వారా మన దేశంలో హైదరాబాద్ సహా అన్ని ముఖ్యనగరాలతోపాటు దుబాయ్‌కి కూడా ఎగుమతి చేస్తున్నాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకపోవడం వల్ల మార్కెటింగ్ ప్రారంభించిన 10 నెలల్లోనే మంచి పేరు వచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొ. రమేష్ చంద్‌తోపాటు ఇజ్రాయిల్ రైతులు, స్పెయిన్ శాస్త్రవేత్తలు సైతం ఫామ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. కుటుంబ బాధ్యతలు, ఫామ్ పనులను ఏకకాలంలో చక్కబెట్టుకోవడం తొలుత ఇబ్బందైనా త్వరగానే నేర్చుకున్నా. మహిళగా నాకు ఈ శక్తియుక్తులు పుట్టుకతోనే వచ్చాయి. – పాయల్ రైనా ఘోష్