రూ.100 కోట్లతో మోడల్ ప్లాస్టిక్ పార్కు
టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.100 కోట్లతో మోడల్ ప్లాస్టిక్ పార్కు (క్లస్టర్) ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి–సిద్దిపేట జిల్లాల పరిధిలో 60 ఎకరాల్లో ఈ పార్కు ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం పరిశ్రమ భవన్లో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుపై సమీక్షించారు.
కామన్ ఫెసిలిటీస్ సెంటర్‌తో పాటు అన్నిరకాల అత్యాధునిక మౌలిక వసతులతో ఈ ప్లాస్టిక్ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా భూములను ఎంపిక చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పార్కు ఏర్పాటుకు సబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులకు వివరించారు. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన అధ్యయన నివేదికపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ పద్మానంద్, అధికారి గ్రాంట్ తోర్నాటన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్: ఈ పార్కు ఏర్పాటుకు అయ్యే రూ.100 కోట్ల వ్యయంలో కేంద్రం 50 శాతం, రాష్ట్రం 25 శాతం, స్పెషల్ పర్పస్ వెహికిల్ కోటాలో యజమానులు 25 శాతం వాటా భరించాల్సి ఉంటుందన్నారు. ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్ గల ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో 200 మంది ప్రమోటర్స్కు, 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.