బికినీకి 70 ఏళ్ళు!
ప్రపంచ అతిచిన్న బాతింగ్ సూట్ గా ప్రకటనల్లో ప్రసిద్ధి చెంది, ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా వంటి ఎన్నో దేశాల్లో రంగు రంగులతో ఆకట్టుకున్న బికినీల వెనుక.. పెద్ద చరిత్రే ఉంది. బికినీలు రూపొందిన తర్వాత మొదట్టో ఎన్నో అభ్యంతరాలు వెల్లువెత్తినా... అనంతరం ఈతకోసం స్త్రీలు ధరించే ప్రత్యేక దుస్తులుగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. అతి కురుచ దుస్తులైన బికినీల వెనుక అభ్యంతరాలు కోకొల్లలైనా... ప్రాచుర్యంలోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి.
భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలను ధరించడం అరుదుగా కనిపించినా.. బాలీవుడ్ సినిమాల్లో తారలు తమ అందాలను ఆరబోసేందుకు బికినీలను ధరించడం దశాబ్దాల క్రితమే కనిపిస్తుంది. సముద్ర తీరాల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్ లోనూ ఈతకోసం స్త్రీలు ధరించే ఈ ప్రత్యేక దుస్తులైన బికినీలు శరీరభాగాలను బహిర్గతం చేస్తున్నాయన్న కారణంతో చాలా దేశాల్లో ఈ దుస్తులపై నిషేధం కూడా విధించారు. టూ పీస్ డ్రెస్ అంటూ మొట్టమొదటిసారి ఈ దుస్తులను ఫ్రాన్స్ దేశస్థుడు లూయిజ్ రియర్డ్ రూపొందించగా..బెర్నార్గీ అనే ఫ్రెంచ్ మోడల్ ధరించి జూలై 5, 1946 లో జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది.
సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలకు వ్యతిరేకమైనా.. తారల అందచందాలను ఒలకబోసేందుకు సినీరంగం ఈ దుస్తులను బాగానే ఆదరించింది. బాలీవుడ్ తార మీనాక్షీ శిరోద్కర్ ఓ మరాఠీ సినిమాలో సింగిల్ స్విమ్ సూట్ లో కనిపించి, చరిత్రను తిరగరాసింది. అనంతరం యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలో షర్మిలా ఠాగూర్, బాబీ సినిమాలో డింపుల్ కపాడియా.. స్విమ్ సూట్ (బికినీ) లో కనిపించగా... తర్వాత ఎందరో నటీమణులు ఆ సంప్రదాయాన్ని ధైర్యంగా కొనసాగించారు. అలాగే తెలుగు సినిమాల్లోనూ నాటితరం నుంచి నేటివరకూ బికినీ భామలు హొయలొలికిస్తూనే ఉన్నారు.
రోమన్ చిత్ర పటాల్లోని బికినీలను పోలిన దుస్తులను చూస్తే ఎన్నో వేల ఏళ్ళ క్రితమే స్త్రీలు బికినీలు ధరించినట్లు తెలుస్తుంది. 1700 సంవత్పరాల క్రితం ఛాంబర్ ఆఫ్ టెన్ మెయిడెన్స్ అనే రోమన్ మొజాయిక్ చరిత్రను చూస్తే.. క్రీడాకారిణులు బికినీలు ధరించినట్లు కనిపిస్తుంది. అనంతరం అనేక రకాల ఆధునిక బికినీలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బీచ్ లాంజెర్ లో రిలాక్స్ అయ్యేందుకు మొట్టమొదటి సౌరశక్తి బికినీ 'ఐకిని' ని డిజైనర్ ఆండ్రూ స్కూనైడర్ రూపొందించారు. 1951 లో జరిగిన ప్రిమియర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన స్వీడన్ కు చెందిన కికి హాకన్ సన్ బికినీని ధరించి టైటిల్ గెలుచుకొంది. అయితే అనంతరం బ్యూటీ పేజెంట్లలో ప్రపంచవ్యాప్తంగా బికినీలపై నిషేధం విధించడంతో.. బికినీ ధరించి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి, చివరి మహిళగా ఆమె మిగిలిపోయింది. అలాగే 30 మిలియన్ డాలర్ల అతి ఖరీదైన బికినీని డైమండ్స్ తో సుసాన్ రోజెన్ రూపొందించారు. స్టార్ వార్స్ 6వ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ లీయా డోన్డ్ సైతం మెటాలిక్ బికినీ ధరించి కనిపిస్తుంది. 90వ శకంలో ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ బీచ్ వాలీబాల్ పోటీలకు 'శాండ్ రిలీజ్ సిస్టమ్' కలిగిన బికినీని మహిళల యూనిఫాంగా అనుమతించింది. జంతు హింసను నిరోధించి జనం శాకాహారులుగా మారాలంటూ చేసిన ప్రచారానికి సైతం మహిళలు.. ముఖ్యంగా ఆకులు అలములతో రూపొందించిన బికినీలు ధరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.