ప్రాణం తీసిన.. సోషల్ మీడియా పోస్ట్
డెట్రాయిట్: సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ అబద్ధపు కథనం ఓ బాలుడి ప్రాణం తీసింది. అమెరికాలో మిచిగాన్కు చెందిన టైసన్ బెంజ్ అనే 11 ఏళ్ల బాలుడు.. తన గాళ్‌ఫ్రెండ్ (13) చనిపోయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చూశాడు. నిజానికి ఆ అమ్మాయి చనిపోలేదు. కొందరు ఆకతాయిలు ఆటపట్టించాలని ఈ తప్పుడు కథనాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలియని బెంజ్ తన గాళ్‌ఫ్రెండ్ చనిపోయిందని భావించి విషాదంలో మునిగిపోయాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంజ్ తల్లి గదిలోకి వెళ్లి చూడగా, అతని వేలాడుతూ కనిపించాడు. డెట్రాయిట్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనం పోస్ట్ చేసిన ఓ నిందితుడిపై కేసు నమోదు చేశారు. తాను చూసినపుడు తన కొడుకు ఉల్లాసంగా ఉన్నాడని, 40 నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్యయత్నం చేశాడని బెంజ్ తల్లి కట్రినా గ్రాస్ ఆవేదన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లో తప్పుడు పోస్టింగ్‌లు చూసి బెంజ్ తన జీవితాన్ని అంతం చేసుకున్నాడని చెప్పింది. గాళ్‌ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నందుకు బాధతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చనిపోయేముందు బెంజ్ పోస్ట్ చేశాడని వెల్లడించింది. తప్పుడు కథనం పోస్ట్ చేసి బెంజ్ మరణానికి కారణమైన బాలనేరస్తుడి వయసు ఎంత? పేరు ఏమిటి? బెంజ్‌తో అతనికి సంబంధం ఏంటి? అన్న విషయాలను పోలీసులు వెల్లడించలేదు. సోషల్ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి టీచర్లు పిల్లలకు చెప్పాలని గ్రాస్ కోరింది.