నేడు ఉడా పాలకవర్గ సమావేశం
విజయవాడ : వీజీటీఎం ఉడా పాలకవర్గ సమావేశం శనివారం జరగనుంది. ఉడా రద్దవుతున్న నేపథ్యంలో జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. నగరంలోని లెనిన్ సెంటర్లో ఉన్న ఉడా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం ఉడా నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులు, విజయసిరి ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. గతంలో ఉడా అధికారులు రూ.1,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా స్పందన వ్యక్తమైనా ఉడా స్వరూపం మారిపోవటంతో అవి మరుగున పడిపోయాయి. ఉడా ఆదాయ వనరులు, ఆస్తులు, ఇతర విషయాలను ఈ నేపథ్యంలో చర్చించనున్నారు. సమావేశంలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఇతర విభాగాల, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొననున్నారు.