నా జన్మదిన వేడుకలు జరపొద్దు
♦ పార్టీ కార్యకర్తలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విజ్ఙప్తి
♦ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టొద్దు
♦ వాటికయ్యే ఖర్చుతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండి
సాక్షి, ముంబై : తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు విజ్ఙప్తి చేశారు. ప్రతిఏటా జూలై 27న జరిగే ఉద్ధవ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు తరలివస్తారు. అయితే ఈ సారి రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా తదితర రీజియన్లలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.
రూ. లక్షలు ఖర్చు చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరారు. ‘గతేడాది రైతులకు పంట చేతికందలేదు. ఈ సారి విత్తనాలు మళ్లీ నాటాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీతో రైతుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి సంకట సమయంలో నేను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సబబు కాదు’ అని కార్యకర్తలు, అభిమానులకు ఉద్ధవ్ సందేశాన్నిచ్చారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం ఖర్చు చేసే డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేయాలని కోరారు.