హోరాహోరీ పోరు: భారీగా పడిపోతున్న పౌండ్
లండన్ : బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతుండటంతో ఫౌండ్ విలువ భారీగా పడిపోతుంది. ఏ పార్టీకి మెజార్టీ ఫలితాలు దక్కకపోతుండటంతో పౌండ్ కూడా కుదుపులకు లోనవుతోంది. గురువారం ముగిసిన పోలింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి థెరిసా మే, లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లు పోటీ పడుతున్నారు. కరెన్సీ మార్కెట్లు మాత్రం కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరిసా మేకే క్లియర్ మెజార్టీ వస్తుందని అంచనావేశాయి. కానీ ఫలితాలు పోటాపోటీగా వస్తుండటంతో పౌండ్ స్టెర్లింగ్ 1.27 డాలర్లకు పడిపోయింది. గురువారం ముగింపుకు ఇది రెండున్నర శాతం తగ్గింపు. యూరోకు వ్యతిరేకంగా కూడా పౌండ్ విలువ ఒకశాతం మేర పడిపోతోంది. జనవరి తర్వాత ఇదే అతిపెద్ద పతనమని తెలిసింది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా ట్రేడర్లు స్పందిస్తున్నారు.
318 సీట్లతో కన్జర్వేటివ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని బీబీసీ అంచనావేసింది. కానీ పోల్ ఫలితాలు మాత్రం ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. పౌండ్ విలువ మరింత కిందకి పడిపోతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. నేడు వెల్లడికాబోయే ఫలితాలతో బ్రెగ్జిట్ అంశం కూడా ముడిపడి ఉంది. పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు.