రూ. 2 కోట్లయినా రెఢీ!
♦ అల్ట్రా లగ్జరీ గృహాల కొనుగోళ్లలో తగ్గని జోరు
♦ 3 నెలల్లో 3,626 యూనిట్ల విక్రయం..
♦ హైదరాబాద్‌లో 204.. గతేడాదితో పోలిస్తే 12% వృద్ధి
♦ రూ.50 లక్షల నుంచి రూ.కోటి గృహాల విక్రయాల్లో మాత్రం 3% తగ్గుదల
దేశంలో ఏటా ఖరీదైన గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,626 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు విక్రయం కాగా.. ఇందులో హైదరాబాద్ వాటా 204 యూనిట్లు. గతేడాదితో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్ల కొనుగోళ్ల వృద్ధి 12 శాతం. ఇక, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ఖరీదైన ఫ్లాట్లు 7,416 అమ్ముడుపోగా.. ఇందులో భాగ్యనగరం వాటా 456 యూనిట్లు. ఏడాది కాలంలో ఈ విభాగం వృద్ధి 15 శాతం.
సాక్షి, హైదరాబాద్
2017 తొలి త్రైమాసికంలో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఎన్సీఆర్, పుణే నగరాల్లో రూ.25 లక్షల్లోపుండే అందుబాటు గృహాల అమ్మకాలు 8 శాతం, గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధిని సాధించాయని లైసెస్ ఫోరస్ రియల్ ఎస్టేట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ నివేదిక వెల్లడించింది. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల గృహాల అమ్మకాలు గతేడాది త్రైమాసికంతో పోలిస్తే 1 శాతం వృద్ధి, ఏడాదితో పోలిస్తే మాత్రం 3 శాతం తగ్గాయి. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల గృహాల అమ్మకాలు త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం, ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి, రూ.2 కోట్లకు మించిన అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు త్రైమాసికంతో పోలిస్తే 13 శాతం, ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
కొనుగోళ్ల వృద్ధికి కారణాలివే..
పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లులతో స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొచ్చింది. దీని ఫలితమే రియల్టీకి ప్రవాసులు, హెచ్ఎన్ఐల పెట్టుబడులు రావటం. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లు ప్రతికూలంలో ఉండటంతో ఆయా దేశాల్లోని ప్రవాసులను మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాయని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టింగ్ సీఈఓ కళిశెట్టి నాయుడు చెప్పారు. గృహ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, మూలధన రాబడి, పన్ను ప్రయోజనాలు వంటివి కూడా కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి తెలిపారు. స్వల్పకాలంలో అధిక రాబడి కారణంగా కొందరు లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తుంటే, మరికొందరేమో ఆధునిక వసతులు, భద్రత వంటి కారణంగా పాత గృహాలను అమ్మేసి మరీ లగ్జరీ ఫ్లాట్లను కొంటున్నారని చెప్పారు.
హైదరాబాద్‌లో 204 లగ్జరీ ఫ్లాట్ల విక్రయం..
2017 క్యూ1లో హైదరాబాద్‌లో మొత్తం 3,257 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో రూ.2 కోట్లకు పైగా ఖరీదైన ఫ్లాట్లు 204, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య 456 ఫ్లాట్లు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు 1,470 యూనిట్లు, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 1,014 యూనిట్లు, రూ.25 లక్షల్లోపు 113 ఫ్లాట్లు ఉన్నాయని లైసెస్ ఫోరస్ రియల్ ఎస్టేట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక వివరించింది. ‘‘నగరంలో ప్రీమియం గృహాల సప్లయ్ తక్కువగా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదును బ్యాంకులో దాచుకోవటం లేక బయట వడ్డీలకు ఇవ్వటం చాలా వరకు తగ్గింది. దీనికి బదులు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలో అధిక రాబడులు పొందొచ్చనే అభిప్రాయం కస్టమర్లలో పెరిగిందని.. ఇవే హైదరాబాద్‌లో ప్రీమియం గృహాల కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు.
పశ్చిమ జోన్లోనే ఎక్కువ..
ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన పశ్చిమ జోన్లోనే లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నార్సింగి, గండిపేట్ వంటి ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ‘‘సుమారు 6 వేల చ.అ. నుంచి వీటి విస్తీర్ణాలుంటాయి. హోమ్ ఆటోమేషన్, 24 గంటలు నీళ్లు, విద్యుత్. కట్టుదిట్టమైన భద్రత. లగ్జరీ క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, థియేటర్ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి. అయితే వసతులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని’’ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో భూముల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలంగా ఉండటం, కాస్మోపాలిటన్ సిటీ, స్థానిక ప్రభుత్వ విధానాలూ వంటివి కూడా ప్రీమియం కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఎన్నారైలు, అధిక వేతనాలుండే ఐటీ, ఫార్మా ఉద్యోగులు, వ్యాపార సంస్థల యజమానులు, ఉన్నతాధికారులు ఈ ఖరీదైన గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్ కంపెనీల ఉద్యోగులూ ఈ జాబితాలో చేరారు.
3 నెలల్లో 64,881 ఫ్లాట్ల విక్రయం..
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 2017 క్యూ1లో మొత్తం 64,881 యూనిట్లు అమ్ముడుపోయాయి. నగరాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అహ్మదాబా ద్లో 6,513, బెంగళూరులో 7,300, చెన్నైలో 3,111, కోల్‌కతాలో 3,126, ముంబైలో 15,824, ఎన్సీఆర్లో 15,400, పుణేలో 10,350 ఫ్లాట్లు విక్రయమయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే చెన్నై మినహా అన్ని నగరాలు 6 శాతం వృద్ధిని నమోదు చేస్తే.. చెన్నైలో మాత్రం 3 శాతం తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. అమ్మకాల వృద్ధిలో 16 శాతంతో బెంగ ళూరు తొలి స్థానంలో నిలిచింది. 8 శాతం వృద్ధితో ముంబై, పుణేలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
స్టిల్ ఫ్లాట్స్ ఫర్ సేల్.. : ఇక, నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న యూనిట్ల గణాంకాలను పరిశీలిస్తే.. పుణేలో గతేడాది క్యూ4లో 1.99 లక్షల యూనిట్లు అమ్ముడుపోకుండా ఉంటే ఈ ఏడాది క్యూ1లో 4 శాతం తగ్గి 1.14 లక్షలకు చేరింది. బెంగళూరులో క్యూ4లో 1.9 లక్షల యూనిట్లుండగా.. ఈ ఏడాది క్యూ1లో 1.6 యూనిట్లకు, అహ్మదాబాద్‌లో క్యూ4లో 75 వేల యూనిట్ల నుంచి 73 వేల యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో క్యూ4లో 46 వేల యూనిట్లుండగా.. క్యూ1 నాటికి 45 వేలకు, ఎన్సీఆర్లో క్యూ4లో 2.53 లక్షలుండగా.. క్యూ1లో 2.49 లక్షలకు తగ్గాయి. ఇక, చెన్నై, హైదరాబాద్, ముంబైలో మాత్రం అమ్ముడుపోకుండా ఉన్న యూనిట్లు పెరిగాయి. చెన్నైలో క్యూ4లో 55 వేల యూనిట్ల నుంచి క్యూ1 నాటికి 60 వేలకు, హైదరాబాద్‌లో క్యూ4లో 35 వేల యూనిట్ల నుంచి క్యూ1లో 36 వేలకు, ముంబైలో క్యూ4లో 2.61 లక్షల యూనిట్ల నుంచి క్యూ1లో 2.67 లక్షలకు పెరిగాయి.