ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.5.75కోట్ల రుణాలు
తాండూరు రూరల్, న్యూస్‌లైన్ : మహిళా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ సభ్యులకు త్వరలోనే రుణాలు అందజేయనున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉమారాణి తెలిపారు. మంగళవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్ హాలులో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు, బంట్వారం మండలాల సీసీలు, వీఓఏలు, ఏపీఎంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏపీడీ ఉమారాణి ప్రసంగించారు. పేద మహిళలు అర్థికంగా ఎదగాలని మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలు అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి - మహిళా సంఘాలకు సంధానకర్తలుగా వ్యవహరించాల్సిన సిబ్బంది అవినీతికి పాల్పడరాదని అన్నారు. రుణాలు ఇప్పిస్తామని మహిళా సంఘాల నుంచి డబ్బులు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా బషీరాబాద్ మండలంలోని బాద్లాపూర్‌తండా, కాశీంపూర్, మల్కాన్‌గిరి, బషీరాబాద్‌లలో ఆమ్ ఆద్మీ బీమా యోజన డబ్బుల పంపిణీలో అవినీతికి పాల్పడి రూ.లక్షా 80వేలు డ్రా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు.
సబ్‌ప్లాన్ ద్వారా రుణాలు
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద జిల్లాలో మహిళా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ సభ్యులకు రూ.5.75కోట్ల రుణాలను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయనున్నట్టు డీఆర్డీఏ ఏపీడీ ఉమారాణి చెప్పారు. ఇందుకోసం సిబ్బంది ఆయా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల వివరాలు సేకరిస్తున్నారన్నారు. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా మహిళలకు ఈ రుణాలు అందుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఇచ్చిన రుణాలకు 3శాతం వడ్డీ ఉంటుందన్నారు. ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
మొదటి విడతలో నియోజకవర్గంలోనాలుగు మండలాలతోపాటు, బంట్వారం మండలాన్ని ఎంపిక చేశామని చెప్పారు. పెద్దేముల్లో 16 గ్రామాలు, యాలాల-5, తాండూరు-12, బషీరాబాద్-15, బంట్వారంలో 5 గ్రామాలను ఎంపిక చేశామని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ బాల్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.