ఎమ్మెల్యే వద్ద 120 కోట్ల అప్రకటిత ఆదాయం
రూ. 1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, హోస్కేటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్‌కు చెందిన ఇళ్లు, స్థలాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ. 120 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడింది. బెంగళూరు, హోస్కేటేల్లో గురువారం నుంచి శనివారం వరకు ఈ దాడులు జరిగాయి. ‘రూ. 120 కోట్లకుపైగా లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు తేలింది. రూ. 1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం.
నాగరాజ్, ఆయన సహాయకులకు చెందినవిగా భావిస్తున్న 560 ఎకరాల భూములకు సంబంధించి పత్రాలను సీజ్ చేశాం. ఆస్తులపై పెట్టుబడులు, వాణిజ్య భవనాలు, ఆస్పత్రుల నిర్మాణం తదితర మార్గాల్లో ఆదాయం సమకూరింది’అని అధికారులు చెప్పారు. నాగరాజ్‌తో సంబంధమున్న భూయజమానులకు అందిన రూ. 70 కోట్లు, సెజ్ కోసం పొందిన రూ. 125 కోట్ల మినహాయింపుపైనా దర్యాప్తు చేస్తున్నారు.