జలసిరి పదిలం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో భూగర్భ జలసిరి పదిలంగానే ఉంది. గతేడాదితో పోలిస్తే జనవరి చివరి నాటికి నీటిమట్టాలు స్వల్పంగా పెరగడం ఊరటనిస్తోంది. బండ్లగూడ,చార్మినార్, మారేడ్పల్లి, నాంపల్లి, శేరిలింగంపల్లి, సైదాబాద్, బహదూర్పురా, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. మారేడ్పల్లి, మల్కాజ్గిరి, అమీర్పేట్ మండలాల్లో స్వల్పంగా నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వేసవి ప్రారంభంలో విచ్చలవిడి బోరుబావుల తవ్వకాన్ని నియంత్రించడంతోపాటు పాతాళగంగను పొదుపుగా వాడుకుంటేనే మండువేసవిలో పానీపట్టు యుద్ధాలు తప్పుతాయని భూగర్భజల శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది జనవరి చివరి నాటికి 8.11 మీటర్ల లోతున భూగర్భ జల జాడ లభించగా.. ఈసారి 7.33 మీటర్ల లోతున పాతాళ గంగ ఆచూకీ లభించినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంటే గతేడాది కంటే 0.78 మీటర్ల మేర భూగర్భ జలసిరి పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది.