మహిళాశక్తి రబ్బరు స్టాంపు కారాదు..
ఐకాస మహిళ విభాగ ప్రతినిధి సరోజినీ గంజుఠాకూరే
బాపట్ల టౌన్: మహిళా ప్రతినిధులు రబ్బరు స్టాంపులుగా మారరాదని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ ప్రతినిధి సరోజిని గంజుఠాకూరే అన్నారు. స్థానిక మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆదివారం మహిళా రాజకీయ ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజని గంజుఠాకూరే మాట్లాడుతూ పురుషులు స్త్రీలకు షాడో ప్రతినిధులుగా వ్యవహరించడం తగదన్నారు. మహిళలే నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలని ఆకాక్షించారు. కార్యాలయాలు, విద్యా సంస్థల వంటి ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల వేధింపులు నిరోధక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ మరో ప్రతినిధి నవనీత సిన్హా మాట్లాడుతూ మహిళల వేధింపులకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ చక్రపాణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ డైరెక్టర్ కృష్ణకుమారి, విజయవాడ వాసవ్య మహిళా మండలి నాయకురాలు రష్మి పాల్గొన్నారు.