నిరుద్యోగులకు టోకరా!
మంచి ఉద్యోగాలంటూ విస్తృత ప్రచారం
⇒ ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కాలేజీకి వేలాదిగా వచ్చిన నిరుద్యోగులు
⇒ కనిపించని ప్రముఖ కంపెనీలు.. ఆగ్రహించిన అభ్యర్థులు
⇒ రహదారిపై రాస్తారోకో.. నిర్వాహకులపై కేసులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఓ సంస్థ భారీ కుచ్చుటోపీ పెట్టింది. టెన్ ప్లస్ టూ అర్హతతో ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి భారీ మోసానికి పాల్పడింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. తీరా మేళా ప్రారంభమైన తర్వాత అందులో ముందస్తు చెప్పినట్లు ప్రముఖ కంపెనీలు కనిపించక పోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. నిర్వహకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారం...
అద్వితీయ సేవా ఫౌండేషన్ (ఏఎస్ఎఫ్) ఆదివారం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల ప్రాంగణంలో ‘గెట్ మై జాబ్’పేరుతో ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసింది. టెక్ మహీంద్ర, విప్రో, జెన్‌ప్యాక్ట్, హెచ్ఎస్బీసీ, హెచ్జీఎస్, ఏజీఎస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, సింక్రోనిక్స్‌ఫైనాన్స్, టీసీఎస్, అమేజాన్, పేటీఎం, కార్వీ, రిలయన్స్, ఐకే ఎస్, హెచ్డీ ఎఫ్‌సీ వంటి 25 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం వారం రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది. రిజిస్టర్ చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు ఆశతో ఉదయం ఏడు గంటలకే మేళాకు వెళ్లారు.
ఆ కంపెనీలెక్కడ..!
ముందస్తుగా ప్రకటించిన మల్టీనేషనల్ కంపెనీలేవీ ఈ మేళాలో కనిపించలేదు. సెక్యూరిటీ, కాల్‌సెంటర్, వెబ్‌డిజైనింగ్ వంటి చిన్నచిన్న సంస్థలు మాత్రమే హాజరు కావడంతో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో పోలీసులు సైతం నిరుద్యోగులను అదుపు చేయలేకపోయారు. చివరకు అదనపు బలగాలు రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరుద్యోగుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు నిర్వాహకుడు నెమలి కుమార్‌తో పాటు అతనికి సహకరించిన మరికొంత మందిపై చీటింగ్ తదితర కేసులు నమోదు చేశారు. నిర్వాహకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిర్వాహకులు గానీ, కళాశాల యాజమాన్యం గానీ పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా జాబ్ మేళా నిర్వహించినట్టు డీసీపీ రమేష్‌నాయుడు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా
మల్లాపూర్‌కు చెందిన జాబ్‌మేళా నిర్వాహకుడు నెమలి కుమార్ కూడా నిరుద్యోగి. జాబ్‌మేళాతో డబ్బు రాబట్టాలని నిర్ణయించాడు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు. స్నేహితులు సహకారంతో పెద్దఎత్తున వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా పెద్ద పెద్ద కంపెనీల పేర్లను కోడ్ చేస్తూ సమాచారం నిరుద్యోగులకు చేరేలా పదిహేను రోజులుగా ప్రచారం చేశాడు. కుమార్‌కు ఎంఎన్సీ కంపెనీలతో సంబంధాలు లేకపోవడంతో పెద్ద కంపెనీలేవీ మేళాకు స్పందించలేదు.