తల్లి సేవలో తరించిన నగరం
నిజామాబాద్కల్చరల్ : ఆషాఢమాసం చివరి ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊరపండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అంటువ్యాధులు సోకకుండా కాపాడాలనీ, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఖిల్లా నుంచి ఉదయం 8.55 గంటలకు గ్రామదేవతలతో ఊరేగింపు ప్రారంభమైంది. గ్రామదేవతల ఊరేగింపునకు ముందుభాగాన ఉండే తొట్లెల కింద నుంచి దూరేందుకు భక్తులు పోటీపడ్డారు. దారిపొడుగునా కొబ్బరి కాయలు కొట్టి, కోళ్లు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో వేడుక సాగింది.