ఆశలన్నీ అల్ప పీడనంపైనే..!
కొవ్వూరు : జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాట్లు వేసే అవకాశం లేక 45 వేల ఎకరాల్లో వరి సాగుకు స్వస్తి పలికినా చలించడం లేదు. ఈ పరిస్థితుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంపైనే జిల్లా రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా గడచిన రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి.
రెండు నెలల్లో అంతంతే..
జూన్లో మురిపించిన వర్షాలు జూలై, ఆగస్టు నెలల్లో అంతంతమాత్రంగానే కురిశాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి. రెండు నెలల్లోనూ వర్షాలు కురిసి ఉంటే డెల్టాలోనూ సాగునీటి కష్టాలు తప్పేవి. ఈశాన్య రుతు పవనాలు పూర్తిగా మొహం చాటేయడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం దీని ప్రభావంతో అయినా వర్షాలు కురిస్తే పంట లను కాపాడుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న నాలుగు రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం డెల్టాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పెరవలి, ఉండ్రాజవరం, తణుకు అత్తిలి, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో జల్లులు కురిశాయి. మెట్ట మండలాల్లో జడివాన కురిసింది.
సరాసరి వర్షపాతం
5.4 మిల్లీమీటర్లు
జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు 573 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 458.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో 5.4 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. కొవ్వూరులో గరిష్టంగా 46.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా జీలుగుమిల్లి, నల్లజర్లలో 1.6 మిల్లీమీటర్ల చొప్పున కురిసింది. గోపాలపురంలో 38.4, కొయ్యలగూడెంలో 18.2, జంగారెడ్డిగూడెంలో 15.6, బుట్టాయగూడెంలో 7.4, ద్వారకాతిరుమలలో 24.2, టి.నరసాపురంలో 8.4, చింతల పూడిలో 5.4, కామవరపుకోటలో 11.6, లింగపాలెంలో 12.4, చాగల్లులో 18.2, దేవరపల్లిలో 9.6, తాళ్లపూడిలో 2.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.