భారత మహిళా రిఫరీకి అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: భారత మాజీ ఫుట్ బాల్ క్రీడాకారిణి, మహిళా రిఫరీ ఉవెనా ఫెర్నాండెస్కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే సెప్టెంబర్‌లో జోర్డాన్‌లో జరుగనున్న అండర్ -17 ఫిఫా మహిళా వరల్డ్ కప్‌లో ఫెర్నాండెస్ రిఫరీగా వ్యవహరించే అవకాశం దక్కింది. ఈ మేరకు ఫెర్నాండెస్ ను రిఫరీగా నియమిస్తున్నట్లు ఫిఫా తన తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. తద్వారా ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీగా వ్యవహించనున్న తొలి భారత మహిళగా ఆమె చరిత్రలో నిలవనున్నారు.
గత 2014 లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో రిఫరీగా వ్యవహరించిన ఫెర్నాండెస్.. ఓవరాల్ ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ నుంచి రిఫరీగా వ్యవహరించే రెండో వ్యక్తి. అంతకుముందు 2002 ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ నుంచి తొలిసారి కె శంకర్ రిఫరీగా వ్యవహరించారు. దాదాపు 14ఏళ్ల తరువాత భారత్ నుంచి మరొక వ్యక్తి ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీగా చేసే అవకాశం దక్కింది. దీనిపై ఫెర్నాండెస్ ఆనందం వ్యక్తం చేశారు. 'ఇది నా కల. అది తీరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు లభించిన అరుదైన గొప్ప అవకాశం. ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీగా చేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ అవకాశం నాకు లభించిన మంచి అవకాశమే కాదు.. మహిళా ఫుట్ బాల్‌కు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుంది' అని ఫెర్నాండెస్ తెలిపారు.