తల్లీకూతుళ్లను బలిగొన్న ట్యాంకర్
నాచారం, న్యూస్‌లైన్: పెట్రోల్ ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను బలిగొంది. బైక్‌ను వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన నాచారం పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... మల్లాపూర్ శక్తిసాయినగర్‌లో జె.ఉప్పలయ్య, లలిత (35) దంపతులు నివాసముంటున్నారు.
వీరికి చిన్నారి వైష్ణవి (6) సంతానం. లలిత తన కుమార్తె వైష్ణవిని తీసుకొని అన్నకొడుకు శ్రీకాంత్ వెంట బైక్ (ఏపీ23ఎన్2760)పై హబ్సిగూడలో ఉండే బంధువుల ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజి వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన (ఏపీ16టీఎక్స్ 2019) పెట్రోల్ ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్ చక్రాలు లలిత వైష్ణవిల పైనుంచి వెళ్లడంతో వారు అక్కడిక్కడే మృతి చెందగా, శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ట్యాంకర్‌ను ఘటనా స్థలంలో విడిచి పారిపోయాడు. పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.