బెండకాయల వ్యాన్ బోల్తా
- తొమ్మిది మంది రైతులకు గాయాలు
- పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తుండగా ఘటన
-------------------------------------------------------------------
కనగానపల్లి : అనంతపురం-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని కనగానపల్లి మండలం కుర్లపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది రైతులు గాయపడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.
ఎలా జరిగిందంటే...
బుక్కరాయసముద్రం, కె.కె.అగ్రహారం, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పది మంది రైతులు కలసి తాము పండించిన బెండకాయలను బెంగళూరు మార్కెట్‌కు తరలించాలనుకుని 407 వ్యాన్‌ను అద్దెకు తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలోని కుర్లపల్లి సమీపానికి రాగానే జాతీయ రహదారిపై వేగంగా దూసుకువచ్చిన గుర్తుతెలియని వాహనాన్ని తప్పించేందుకు వ్యాన్ డ్రైవర్ ఎర్రిస్వామి ప్రయత్నించాడు. అయితే వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. వ్యాన్‌లోని మూటలపై కూర్చొన్న రైతులు ఎగిరి కిందపడ్డారు. ఘటనలో అంజి, నాగరాజు, వెంకటరాముడు, అబ్దుల్ రజాక్, నాగముని, కృష్ణారెడ్డి, నాగర్జున, శివరాం, రమేశ్ అనే రైతులు గాయపడ్డారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి.
హైవే పెట్రోలింగ్ సిబ్బంది చొరవ
ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ రైతులను వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. ఆ తరువాత కనగానపల్లి, ధర్మవరం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిన మూటలతో పాటు వ్యాన్‌ను పక్కకు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.