ఇంగ్లీష్ ఛానెల్లో ప్రమాదం
- భారీ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన రవాణా నౌక
పారిస్: ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాలను వేరుచేసే ఇంగ్లీష్ ఛానెల్(అట్లాంటిక్ సముద్ర పాయ)లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సరుకు రవాణా నౌక ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఫ్రాన్స్ తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్లో 38వేల టన్నుల హైడ్రోకార్బన్ ఇంధనం నిండిఉండటంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పొరపాటున అది పేలిపోయినా లేదా ఆయిల్ లీకైనా పెనుత్పాతం సంభవించి ఉండేది.
‘గ్వాటెమాలా దిశగా ప్రయాణిస్తోన్న ఆయిల్ ట్యాంకర్‘ది సీఫ్రంటైర్’ను.. లాగోస్(నైజీరియా) వెళుతోన్న సరుకురవాణా నౌక(ఎండీవర్) ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయని, ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సహాయక సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో రెండు నౌకలూ పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే ఆయిల్ లీకేజీ కాలేదని చెబుతున్నప్పటికీ స్పష్టత రావాల్సిఉంది.
ఆయిల్ ట్యాంకర్, సరుకు రవాణా నౌక.. ఇవి రెండూ హాంగ్‌కాంగ్‌కు చెందినవని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో నౌకల్లో ఉన్న భారత్, చైనాలకు చెందిన సిబ్బంది 27మంది సిబ్బంది స్వల్పంగా గాయపడ్డట్లు తెలిపారు. సరుకు రవాణా నౌక తిరిగి ప్రయాణించేందుకు అనుమతి లభించగా, ఆయిల్ ట్యాంకర్‌ను మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు.