పార్టీలు మారడమంటే ఎంగిలి మెతుకులు తిన్నట్టే
♦ త్వరలోనే రాజకీయాల్లోకి...
♦ ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వెల్లడి
చంద్రగిరి: ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. పార్టీలు మారడమంటే ఎంగిలి మెతుకులు తినడంతో సమానమే. ఒక నాయకుడుని నమ్మి వెళితే ఐదేళ్లపాటు ఆయన వెనుక ఉండాలి. నాయకుడి తీరు నచ్చకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలే తప్ప పార్టీ మారకూడదు’ అని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతికి సమీపంలోని విద్యానికేతన్ విద్యాసంస్థల్లో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పేపర్లో చూసి ప్రతిరోజూ బాధపడుతున్నానని చెప్పారు. మనకెందుకు అని ఊరుకుంటే కరెక్ట్ కాదనీ, మోహన్‌బాబు అంటే ఏమిటో తెలపడానికే త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ఆవేశపరుడినే తప్ప అవినీతిపరుడు కాదన్నారు. తనను కుల, మతాలకతీతంగా అందరూ ఆదరిస్తారని చెప్పారు. ‘‘మీరు వైఎస్సార్సీపీలోకి వెళ్ రా? లేక టీడీపీలోకా?’ అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతి పక్షనేతలిద్దరూ తనకు బంధువులేనన్నారు. తాను ఏపార్టీలో చేరబోతున్నాననేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
ఒక్క కళాశాలకే ప్రభుత్వం రూ.18 కోట్ల బకాయి
ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కింద ఒక్క 2015-16 విద్యా సంవత్సరంలోనే విద్యా నికేతన్ కళాశాలకు ప్రభుత్వం రూ. 18 కోట్లు బకాయి పడిందని మోహన్‌బాబు మండిపడ్డారు. తమ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా జర్మనీకి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో మోహన్‌బాబు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం పట్టించుకోకపోయినా అధికారులు మాత్రం కళాశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేదా? అంటూ తనిఖీలు చేయడానికి వస్తుంటారని విమర్శించారు. తాను సినీ నటుడిగా సంపాదించిన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.