vigilantism
-
మూక హత్య కేసులో మరో ట్విస్ట్
జైపూర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ మూక హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో గత శుక్రవారం రక్బర్ ఖాన్ (28) అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అతను మరణించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే బాధితుడి మృతికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ అక్బర్ ఖాన్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రికి తరలించకుండా బాధితుడిని 3గంటల 45 నిమిషాల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో కేసును స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌కు బదిలీ చేసినట్లు, పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు జైపూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ హేమంత్ ప్రియదర్శి తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. దాడి జరిగినట్లు పోలీసులకు అర్థరాత్రి 12.41 సమాచారం ఇచ్చామని, వారు 1,20కు ఘటనాస్థలికి వచ్చినట్లు స్థానిక మానవ హక్కుల కార్యకర్త నవల్ కిషోర్ తెలిపారు. బురదతో ఉన్న బాధితుడు రక్బర్ ఖాన్‌కు పోలీసులు స్నానం చేయించారని, అనంతరం తన ఇంటికి వచ్చి ఆవులను తరలించడానికి వాహనం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో పోలీసులు బాధితుడిపై చేయిచేసుకున్నట్లు కిషోర్ కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. అతను అప్పుటికి బతికే ఉన్నాడని కూడా తెలిపారు. మరోవైపు బాధితుడు గాయాలతో అరుస్తున్నా.. పోలీసులు పట్టించుకోకుండా టీ తాగుతూ కాలక్షేపం చేశారని కిషోర్ పేర్కొన్నారు. అనంతరం తను ఆవులను గోశాలకు తీసుకెళ్లానని, పోలీసులు బాధితుడిని స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు. ఇక ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా.. పోలీసులు బాధితుడి తీసుకొచ్చేలోపు అతను మరణించాడని స్పష్టం చేశారు. రక్బర్ ఖాన్, అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తుండగా.. అల్వార్ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. అస్లాం వారి నుంచి తప్పించుకోగా రక్బర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాధితుడి మరణానికి పోలీసులు కూడా కారణమని ఆరోపణలు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ ఘటన పట్ల సీరియస్‌గా ఉన్నారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ జిల్లాలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: రాజస్తాన్‌లో మూక హత్య.. -
అత్యంత అమానుషంగా కొట్టి చంపారు
జైపూర్ : గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు హెచ్చరించినా అలాంటి దాడులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్‌లో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే నెపంతో ఇద్దరి యువకులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తప్పించుకున్నారు. గత అర్ధరాత్రి మృతుడు అక్భర్(28), అస్లామ్ అనే మరో వ్యక్తితో ఆవులను తీసుకెళ్తుండగా.. రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వార్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువకులు ఆవులను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని వెంబడించి మరీ అక్బర్‌ను పట్టుకోగా.. అస్లామ్ తప్పించుకున్నాడు. అక్భర్పై మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి, మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆ రెండు ఆవులను సమీప గోశాలకు తరలించామని, ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశామన్నారు. అయితే మృతుడు హర్యానాకు చెందినవాడని, ఆవుల అక్రమ రవాణకు పాల్పడ్డారా లేదా అనే విషయం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ గ్రామంలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: గోరక్షణ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలపై సుప్రీంకోర్టు మండిపడింది. చట్టాన్ని ఏ రూపంలో అతిక్రమించినా అలాంటివారిని కాపాడాల్సిన పనిలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. శాంతిభద్రతల వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వస్తున్నందున రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. గోరక్ష పేరుతో హింసను సహించేది లేదని ఇటీవలే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు గుర్తుచేశారు. ‘శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇందులో కేంద్రానికి సంబంధం లేదు. అయినా ఎటువంటి దాడులనైనా సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది’ అని ఎస్జీ తెలిపారు. గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు కోర్టుకు సమాధానమిస్తూ.. తమ వద్ద జరిగిన కేసులపై విచారణ జరుపుతున్నామని.. ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనానికి తెలిపారు. పలుచోట్ల బాధితులకు పరిహారం కూడా అందినట్లు వెల్లడించారు. కేంద్రంతోపాటుగా పలు రాష్ట్రాలు పిటిషన్‌కు సమాధానం ఇవ్వలేదని గోరక్ష దాడులపై పిటిషనర్ల తరపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే తెలిపారు. అయితే.. సెప్టెంబర్ 6 లోగా కేంద్రం, ఆయా రాష్ట్రాలు సవివరమైన సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.