కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరంగం
మద్యం మత్తులో అనుచరులతో కానిస్టేబుళ్లపై దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు
యుబీ సిటీలో అర్ధరాత్రి హంగామా
బెంగళూరు : మద్యం మత్తులో ఉన్న ఎమ్మెల్యే, అతని అనుచరులు తమపై దాడి చేశారని ముగ్గురు కానిస్టేబుళ్లు ఇక్కడి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాగల్‌కోటే జిల్లా మనగుంద కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాష్యపన్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి ఇక్కడి యుబీ సిటీలోని 16వ అంతస్తులో ఉన్న స్కై బార్ రెస్టారెంట్లో తన అనుచరులకు పార్టీ ఇచ్చారు.
అందరూ ఫుల్‌గా తాగారు. అర్ధరాత్రి 12 గంటలు కావడంతో బార్ సిబ్బంది లైట్లు ఆఫ్ చేశారు. దీంతో విజయానంద్ అనుచరులు రెచ్చిపోయారు. బెదిరించి మద్యం తెప్పించుకున్నారు. మ్యూజిక్ కూడా పెట్టించుకొని డ్యాన్స చేశారు. ఆ సమయంలో గస్తీ తిరగుతున్న కబ్బన్‌పార్కు పోలీసులు కుమార్, కిరణ్, ప్రశాంత్ నాయక్ స్కై బార్ రెస్టారెంట్ ఇంకా తెరిచే ఉండటంతో అక్కడికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే, అతని అనుచరుల చేష్టలను ప్రశాంత్ నాయక్ తన మొబైల్‌ల్లో చిత్రీకరించడానికి యత్నించాడు. దీంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు పోలీసులపై దాడి చేసి.. దుర్భాషలాడారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కబ్బన్‌పార్కు సీఐ ఉదయ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. కాగా, బుధవారం ఉదయం ఆ ఎమ్మెల్యే నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఫోన్ చేసి పోలీసులే తనపై దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదు చేయడానికి యత్నించాడు.
అయితే కమిషనర్, బెంగళూరు సెంట్రల్ విభాగం డీ సీపీ రవికాంత్ గౌడ కబ్బన్ పార్క్ పోలీసులతో వివరణ తీసుకున్నారు. స్కై బార్ అండ్ రెస్టారెంట్‌లోని సీసీ కెమెరా క్లిప్పింగ్‌లను పరిశీలించారు. బార్ యజమాని, సిబ్బందిని విచారణ చేశారు. వెంటనే ఎమ్మెల్యే, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే, అతని అనుచరులపై ఐపీసీ సెక్షన్లు 504, 323, 353,149 కింద కేసు నమోదు చేశారు.
కేసు విచారణలో ఉంది : హోం మంత్రి
ఎమ్మెల్యే విజయానంద్ కాష్యపన్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని హోం మంత్రి కే.జే. జార్జ్ అన్నారు. బుధవారం ఆయన విధాన సౌధలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయినా అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అరెస్ట్ చేయాలి : శెట్టర్
ఈ విషయంపై శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ.. పోలీసులపై దౌర్జన్యం చేసిన విజయానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలకు వెనుకాడితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నాకు సంబంధం లేదు : విజయానంద్
ఎమ్మెల్యే విజయానంద్ విధానసౌధలో మాట్లాడుతూ.. తాను కుటుంబ సభ్యులతో ఆ రెస్టారెంట్‌కు వెళ్లానని, ఈ గొడవతో తనకు సంబంధం లేదని అన్నారు.