ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
సర్కారు మౌఖిక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: విజయవాడ-గుంటూరు పరిసరాల్లో భూముల రిజష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువను నిర్ధారించడంద్వారా స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అరుునట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒకటీ రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులూ వెలువడనున్నట్టు తెలిపారు.
భూముల ధరల పెరుగుదల ప్రభావం రాజధాని లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములను కూడా సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే భూసేకరణ జరిపే సమయానికి వాటి ధరలు ఇంకా పెరిగిపోతే పరిహారం, ఇతరత్రా ఇబ్బందులు వస్తాయనే కారణంతో భూముల క్రయవిక్రయాలు జరపకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.