బెజవాడ బరిలో చిన్నమ్మ?
హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరిని విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. అక్కడ కుదరని పక్షంలో గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రతిపాదించింది. విజయవాడ సీటుకు ఎర్నేని సీతాదేవి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక ప్రస్తుతం పురందేశ్వరి ఎంపీగా ఉన్న విశాఖపట్నం స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన కంభంపాటి హరిబాబు పేరును ప్రతిపాదించారు. అరుుతే హరిబాబుతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలన కోసం జాబితాలో చేర్చారు.
సీమాంధ్రలో బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసిన రాష్ట్ర శాఖ ఒకటీ రెండురోజుల్లో వీటిని జాతీయ నాయకత్వానికి పంపనుంది. హరిబాబుతో పాటు ఆ ప్రాంత పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు నాయకత్వంలో కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, శాంతారెడ్డి, బండారు రంగమోహన్‌రావు, సురేశ్‌రెడ్డి తదితరులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యూరు. 175 శాసనసభా స్థానాలకు 280 మంది, 25 ఎంపీ సీట్లకు 90 మంది ఆశావాహులు ఉండగా.. మొత్తం స్థానాలకు ఉన్నంత లో బలమైన అభ్యర్థుల పేర్లను సూచిస్తూ జాబితాలను రూపొందించారు. తమ ప్రాంతంలో ఇతర పార్టీలతో ఎన్నికలకు పొత్తు పెట్టుకునే అంశంపై నిర్ణయూన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలివేశామని హరిబాబు తెలిపారు. ఎన్నికల కమిటీ సమావేశానంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీలోకి రమణబాబు
వశిష్ట, ద్రోణ విద్యాసంస్థల చైర్మన్ ఎన్వీ రమణబాబు బీజేపీలో చేరారు. హరిబాబు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి భవర్‌లాల్‌వర్మ, మజ్దూర్‌మోర్చా గ్రేటర్ అధ్యక్షుడు తాళ్ల రవీందర్గౌడ్లతో కలిసి ఆయన శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.