మనోళ్లు మెరిశారు
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు మెరిశారు. రాష్ట్రానికి చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్ మూడు, జ్యోతి సురేఖ రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. చైనాలోని వుజిలో శనివారం జరిగిన పోటీల్లో... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జిజ్ఞాస్ కాంస్యం గెలిచాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 143-141 తేడాతో స్కారియోక్స్(బెల్జియం)పై విజయం సాధించాడు.
అటు మిక్స్డ్ ఈవెంట్లో జిజ్ఙాస్, సురేఖ 153-144తో బెల్జియం జోడిపై గెలిచి కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఇద్దరి రాణింపుతో అటు పురుషుల, ఇటు మహిళల కాంపౌండ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్యాలు దక్కాయి. మహిళల జూనియర్ కాంపౌండ్ జట్టు (సురేఖ, జయలక్ష్మి, స్వాతి) 223-214తో మెక్సికో జట్టుపై గెలిచింది. అలాగే పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చిట్టిబొమ్మ జిజ్ఞాస్, రజత్ చౌహాన్, సుధాకర్ కుమార్‌తో కూడిన జట్టు 229-222 తేడాతో బ్రిటన్‌పై నెగ్గి కాంస్యం సాధించింది.
‘మరింత మెరుగ్గా రాణించాల్సింది’
‘ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన జంషెడ్పూర్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నీలో గాయం తర్వాత మొదటి సారి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాను. అయితే కాంస్యాల కన్నా మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉండాల్సింది. కొరియాలో జరిగే ఆసియా గేమ్స్‌లో భారత జట్టు తరఫున పాల్గొనాలన్నదే నా లక్ష్యం’
- జిజ్ఞాస్
‘సంతోషంగా ఉంది’
‘తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈనెలాఖరున జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. అయితే దీనికి మరింత మెరుగైన కోచింగ్ తీసుకోవడంపై దృష్టి పెట్టాను.’
- జ్యోతి సురేఖ