'నిరుద్యోగ యువత దేశానికి ప్రమాదకరం'
హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో వికాస్‌పర్వ్ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పాల్గొన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో సాధించిన విజయాలపై ప్రదర్శన నిర్వహించారు, ఈ కార్యక్రమంలోనరసింహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు. నిరుద్యోగ యువత దేశానికి ప్రమాదకరమన్నారు.
హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు కేంద్రం మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని, కార్మికులకు కొన్ని కంపెనీలు కనీస వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలతో చర్చించి కార్మికులకు బోనస్ అందించే విధంగా చూడాలని కేంద్రమంత్రి దత్తాత్రేయను కోరారు. కార్మికులు, కంపెనీ యాజమాన్యాలు కలిసి పనిచేసి ఉత్పత్తులు పెంచుకోవాలని కోరారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో కార్మిక వ్యతిరేక యాజమాన్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కనీస వేతనం పెంపు అమలుపై వారం లోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.