రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి
ముందుకొచ్చిన విన్యాస్ గ్రూప్
♦ పీసీబీ, కేబుల్స్ తయారీ యూనిట్ల ఏర్పాటు
♦ కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న మైసూరుకు చెందిన విన్యాస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఎల్సినా రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో రెండు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన పీసీబీ, కేబుల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. పార్క్‌లో యాంకర్ యూనిట్‌గా అడుగుపెట్టిన విన్యాస్ గ్రూప్ ఈ యూనిట్ల స్థాపనకు వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించనుంది. విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ పీసీబీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోం ది. విన్యాస్, అమెరికాకు చెందిన డీసీఎక్స్ చోల్ల జేవీ అయిన డీసీఎక్స్ కేబుల్ అసెంబ్లీస్ కేబుల్స్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. 2017 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభం కానుంది. నాలుగేళ్లలో రూ.3,000 కోట్ల విలువైన ఆర్డర్లను సాధించాలన్నది లక్ష్యం. రియల్టీ, ఇన్ఫ్రా రంగంలో ఉన్న కేజేఆర్ గ్రూప్ ఎల్సినా రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌ను ప్రమోట్ చేస్తోంది.
డిఫెన్స్ రంగంలో హబ్‌గా..
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో దిగ్గజ సంస్థలైన ఇజ్రాయెల్ కంపెనీలు ఎల్టా సిస్టమ్స్, రాఫెల్, ఎల్బిట్ సిస్టమ్స్‌తో విన్యాస్ చేతులు కలిపింది. ఈ సంస్థలు పీసీబీ, కేబుల్స్ తయారీకి కావాల్సిన మెషినరీని విన్యాస్ గ్రూప్‌నకు సరఫరా చేస్తాయి. అలాగే ఇక్కడ తయారైన పీసీబీ, కేబుల్స్‌ను కొనుగోలు చేస్తాయి. రానున్న రోజుల్లో ఈ మూడు కంపెనీలతో కలసి విన్యాస్ జేవీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విన్యాస్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎలక్ట్రానిక్స్ పార్క్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి హబ్ కానుందని కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పార్క్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలను ఆహ్వానించేందుకు ఇజ్రాయెల్‌కు ఆగస్టులో వెళ్తున్నట్టు చెప్పారు.
వేలాది మందికి ఉపాధి..: విన్యాస్ యూనిట్లలో మూడేళ్లలో ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిం చనుంది. అనుబంధ యూనిట్లూ రానున్నాయి. మానవ వనరుల కోసం ఈ కంపెనీతో కలసి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు కేజేఆర్ గ్రూప్ సీఈవో కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఐటీఐ, పాలి టెక్నిక్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఇక్కడ శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 6 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్‌లో ప్రైవేటు రంగంలో అనుమతి పొందిన తొలి ఎలక్ట్రానిక్స్ పార్క్ తమదేనని పేర్కొన్నారు.