చిన్న సంకేతం.. పెద్ద ఫలితం
సాక్షి, విశాఖపట్నం : పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లారు.. అనుకోని ఆపద ఎదురైంది. ఇక ప్రాణాలతో బయటపడలేమనుకున్నారు. అయినా ఆశగా చివరి క్షణం వరకూ పోరాడారు. ఫలితం దక్కింది. వారు పంపిన చిన్న సంకేతం చెన్నై అధికారులకు చేరింది. అక్కడి నుంచి సమాచారం అందుకున్న విశాఖ కోస్ట్‌గార్డ్ దళాలు రంగంలోకి దిగి మత్స్యకారులను కాపాడి తీరానికి చేర్చారు. నేవల్ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. కమాడి శ్రీకాంత్‌కు చెందిన ఫిషింగ్ బోటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఈ నెల 10వ తేదీన ఎనిమిది మంది మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లింది.
15వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో విశాఖకు ఆగ్నేయంగా సుమారు 104 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసరికి బోటులో సాంకేతిక సమస్య తలెత్తింది. గేర్‌బాక్స్ చెడిపోవడంతో బోటు అక్కడే నిలిచిపోయింది. దాన్ని బాగు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరి ప్రయత్నంగా ప్రమాద సంకేతాలు పంపే డిస్ట్రెస్ అలెర్ట్‌ను వినియోగించారు. ఆ ప్రయత్నం ఫలించింది. అది పంపిన సంకేతాలను చెన్నైలోని కోస్ట్‌గార్డ్ మారిటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) అందుకుంది. వెంటనే విశాఖ కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం అందించింది.
ఎంఆర్సీసీ నుంచి సమాచారం రాగానే విశాఖలోని కోస్ట్‌గార్డ్ ఆపరేషన్ సెంటర్ (డిస్ట్రిక్ హెడ్‌క్వార్టర్ నెం.6) నుంచి రక్షణ చర్యలకు కమాండెంట్ హెచ్ఎస్ షెరావత్ నేతృత్వంలో కోస్ట్‌గార్డ్ నౌక రాజ్వీర్ బయలుదేరింది. నడి సముద్రంలో నిలిచిపోయిన ఫిషింగ్ బోటును అన్వేషిస్తూ ముందుకుసాగింది. ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి 12.35 గంటల సమయంలో దాని ఆచూకీని కనుగొంది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే ఫిషింగ్ బోటులోని మత్స్యకారులను కాపాడి వారికి ఆహారం, ప్రాథమిక వైద్యం అందించారు. అక్కడి నుంచి వారిని, ఫిషింగ్ బోటును తీసుకుని బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ తీరానికి చేరుకున్నారు. మత్స్యకారుల వివరాలు తెలుసుకుని వారిని స్వస్థలాలకు పంపించారు.