సాహిత్య పత్రికను నడపాలన్న వెర్రి ఉన్నవాడు...
శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్ రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి అన్నట్టుగా శశిశ్రీ సాహిత్య నేత్రంను తీసుకువచ్చాడు. సాహిత్యనేత్రం కథల ఎంపికలో దాదాహయత్, రామచంద్రరాజు, నేను పాలుపంచుకొనేవాళ్లం. అప్పటికే ప్రముఖ రచయితలైనవారి కథలను కూడా తిరస్కరిస్తూ అందుకు సహేతుకమైన కారణాలతో ఉత్తరం తయారు చేసి పంపేవాడు శశిశ్రీ. దీనికి మొదట వ్యతిరేకత వచ్చినా తర్వాత ఆ రచయితలే శశిశ్రీని అభినందించారు. రెండేండ్లు గడిచేసరికి శశిశ్రీ తనకుతాను ఒక మంచి సంపాదకుడుగా రూపుదిద్దుకున్నాడు.. సాహిత్య నేత్రం నేపథ్యంలో తను కూడా ఒక కథకుడిగా మారాడు.
ఏడురోడ్ల కూడలిలో శశిశ్రీ కార్యాలయం ఒక సాహిత్య కూడలిగా తయారయ్యింది. బయటి జిల్లాల నుంచి సాహిత్యకారులు ఎవరు కడపకు వచ్చినా సాహిత్య నేత్రం కార్యాలయాన్ని వెతుక్కుంటూ రావాల్సిందే. ఇటు అనంతపురంలోని సింగమనేని వారి మిత్ర రచయితలు, అటు ఉత్తరాంధ్రలో కాళీపట్నం రామారావుతో పాటు వారి మిత్ర రచయితలు, హైదరాబాద్లో కె.శివారెడ్డి వారి మిత్రబృందం.. అందరితో పరిచయాలు ఏర్పడినాయి. ఒకసారి పరిచయమైనవారిని శశిశ్రీ ఓ పట్టాన వదిలిపెట్టేవాడు కాదు. కడపలో సత్యాగ్ని (షేక్ హుసేన్), శశిశ్రీ (షేక బేపారి రహమతుల్లా) ఇద్దరూ సాహిత్యంలో ఉన్నా సత్యాగ్ని ఎక్కువగా రాజకీయాల్లో ఉండి ‘రాజకీయవాది’గానే ముద్ర వేసుకొన్నాడు. శశిశ్రీ చివరి వరకూ సాహిత్యంతో అంటకాగుతూ జర్నలిస్టుగా జీవనం సాగించాడు. ఇంతా చేసి ఆయన సంపాదించుకున్నది ప్రభుత్వం జర్నలిస్టులకిచ్చిన స్థలంలో కట్టుకున్న ఇల్లే.
శశిశ్రీ తన జీవితంలో ‘శశిశ్రీ’గానే మనగలిగాడు. కాని కూతురి పెండ్లి చేయాల్సిన సందర్భంలో కుటుంబపరమైన, మతపరమైన ఒడిదుడుకులు వస్తే ఎలా అనే కించిత్ భీతి కలిగింది. అప్పట్నించి తనవాళ్లను రోజులో కాసేపైనా కలవడం మొదలుపెట్టాడు.
ఆయనకు క్యాన్సర్ సోకిందని తెలియక ముందు వెన్నుపూసలో నొప్పి అంటూ ఫిజియోథెరపీ చేయించుకునేవాడు. చాలాసార్లు నేను తోడుగా వెళ్లి ఆస్పత్రిలో గంటలు గంటలు గడిపేవాడిని. క్యాన్సర్ సోకిందని తెలిశాక ఇంట్లోనే విశ్రాంతి తీసుకొంటున్న రోజుల్లో కూడా అప్పుడప్పుడు కలిసేవాడిని. సాహత్యాభిలాష ఉన్నవాళ్లతో మాట్లాడటం ఆయనకు కొత్త ఉత్సాహాన్నిచ్చేది. చివరగా నెలరోజుల క్రితం వెళ్లినప్పుడు నా యోగక్షేమాలు అడిగి, నా ఆర్థిక సమస్యలు ప్రస్తావించి ‘త్వరగా బయటపడేందుకు ఏదో ఒకటి ఆలోచించండి. సమాజం దుర్భరమైనవి. జీవితం ఇంకా దుర్మార్గమైనది. ఆలోచించండి’ అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ‘నేను తిరిగి కోలుకుని తిరుగుతానా? ఇట్లే వెళ్లిపోతానా’ అని అడుగుతూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. శశిశ్రీ ఆత్మస్థైర్యం కోల్పోయాడని అర్థమైపోయింది. ఆయన కళ్లలో కన్నీళ్లు చూశాక ఇక ఆయన వద్దకు వెళ్లలేకపోయాను. ఓదార్చడమెలాగో నాకు తెలియదు. చివరకు ఆయన మార్చి 31 వ తేదీన రాత్రి 10.45కు తను సంపాదించుకున్న సాహితీవేత్తలకు మాటమాత్రమైనా చెప్పకుండా వెళ్లిపోయాడు.
మనిషితనం ఉన్న మనిషిగా పరిచితుల స్మృతిలో, మనసున్న కథలు రాసిన రచయితగా పాఠకుల స్మృతిలో ఎప్పటికీ జ్ఞాపకాల వెన్నెలలు వెదజల్లుతూనే ఉంటాడు- శశిశ్రీ.
- పాలగిరి విశ్వప్రసాద్, 9866511616