ప్యాకేజి కంటే హోదా వల్ల ఎక్కువ నిధులొస్తాయా: బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఒకపక్క రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమించేందుకు యువత సిద్ధం అవుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మళ్లీ అవే మాటలు చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై జరిగిందేదో జరిగిపోయిందేని, కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అనేది హామీయే తప్ప అది చట్టం కాదని స్పష్టం చేశారు.
ప్యాకేజి కంటే హోదా వల్ల నిధులేమైనా ఎక్కువ వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. అసలు తనకంటే సీనియర్లు, సమర్థులు ఎవరున్నారని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అవసరమని చెప్పారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటని ఇంకోసారి అడిగారు. విశాఖపట్నంలో ఈనెల 27, 28 తేదీలలో జరిగే సీఐఐ సదస్సుతో రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని, ఆ సదస్సు వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు.