‘వెట్టి’ బతుకులు
– శ్రమ దోపిడికి గురవుతున్న వీఆర్ఏలు
– కనీస వేతనాలు కరువు
– సకాలంలో అందని వైనం
– అమలుకాని చంద్రబాబు ఎన్నికల హామీ
వారు చిరుద్యోగులు.. అధికారులకు నిత్యమూ అందుబాటులో ఉంటూ సేవ చేయాలి. కార్యాలయానికి వచ్చి పోయే ప్రముఖులకు టీ, కాఫీలు మోయాలి. అదే సమయంలో ప్రజలతోనూ మమేకం పనులు చేస్తూ ఉండాలి. అవసరం పడితే రేయింబవళ్లూ ఒంటరిగా అనాథ శవాల వద్ద కాపలా కాయాలి. ఒకరు ఛీ కొడితే భరించాలి.. దూషించినా పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోవాలి! ఇదండీ రెవెన్యూ గ్రామ సహాయకుల (వీఆర్ఏ) జీవితం. జీతాలు తక్కువ.. పనిభారం ఎక్కువ! నిరంతర విధుల నిర్వహణలో తలమునకలుగా ఉండే వీఆర్ఏలు అత్యంత ఘెరంగా వెట్టి చాకిరీకి గురవుతున్నారు.
- రామగిరి (రాప్తాడు)
ప్రభుత్వ కార్యకలాపాల్లో వీఆర్ఏలు లేనిదే ఏ పనీ జరగదు! రెవెన్యూ పాలనా విభాగంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగులు వీరే. గ్రామ స్థాయిలో పంచనామాల నిర్వహణ, రెవెన్యూ, పోలీస్‌శాఖలకు అవసరమైన గ్రామ స్థాయి సమాచారాన్ని సేకరించి ఇవ్వడం, ప్రభుత్వ సమావేశాల నిర్వహణ, అధికారుల ఆదేశాలను అమలు చేస్తూ.. రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత వీఆర్ఏలపై ఉంది. ఇన్ని పనులు చేస్తున్నా... వీరికిచ్చే వేతనం మాత్రం నాలుగు అంకెలకు మించి పోవడం లేదు. అత్యంత దయనీయ స్థితిలో కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్న వీఆర్ఏలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
‘వెట్టి’ బతుకులు
వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వం.. వీఆర్ఏలను ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతోంది. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న వీఆర్ఏలు కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 3,314 గ్రామాల్లో 924 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరంతా నిరంతరం పనుల ఒత్తిడితో సతమతమవుతున్న నెలకు వేతన రూపంలో ప్రభుత్వం చెల్లించేది కేవలం రూ. 6,500 మాత్రమే! ఇది కూడా ప్రతి నెలా సక్రమంగా వారికి అందడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి బాడుగలు, పిల్లల చదువులకు ఈ వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు అత్యంత దుర్భర జీవితాలను గడుపుతున్నారు.
నెరవేరని చంద్రబాబు హామీ
తాము అధికారంలోకి వస్తే వీఆర్ఏలను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ... వారికిచ్చే రూ. 6,500 వేతనాన్ని రూ. 15 వేలు చేస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హామీనిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. ఆ హామీ నేటికీ నెరవేరలేదు. ఇదే వీఆర్ఏలకు తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 20 వేల మంది వీఆర్ఏలకు కనీస వేతనంగా రూ. 10,500లను ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేకాక ప్రతి ఒక్క వీఆర్ఏకు ప్రత్యేకంగా డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇచ్చింది.
010 పద్దు రద్దుతో తిప్పలు
వీఆర్ఏలకు 2014 ఫిబ్రవరి వరకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించిన ప్రభుత్వం... ఆ తర్వాత ఆ పద్దును రద్దు చేసి బడ్జెట్ కంట్రోల్ చేసింది. దీంతో నెలనెలా వేతనాలు అందక వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 010 పద్దును పునరుద్దరించాలన్న వీఆర్ఏల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అలాగే పదో పీఆర్సీని వర్తింపజేస్తూ ప్రతి నెలా వేతనాలను కచ్చితంగా చెల్లించాలనే డిమాండ్‌ను సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంప్లాయికోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే వీఆర్ఏలకు ఎంప్లాయికోడ్ కేటాయించకపోవడంతో ఈ అవకాశాన్ని కూడా వారు కోల్పోయారు. అన్నింటా దగా పడిన వీఆర్ఏలో తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాటపడితే రెవెన్యూ పాలన వ్యవస్థ గాడితప్పే ప్రమాదముంది. అయినా ప్రభుత్వం వీఆర్ఏల పట్ల నిర్ధయగా వ్యవహరిస్తూ వారితో వెట్టి చాకిరీ చేయించుకునేందుకే మొగ్గు చూపుతోంది.