సిరిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరం అరెస్ట్
నెల్లూరు: సిరిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సుందరంని ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో సిరిగోల్డ్ మనీ స్కీం సంస్థను 2008లో స్థాపించారు. అతి కొద్ది కాలంలోనే వందలాది మంది ఏజంట్లు - లక్షకుపైగా ఖాతాదారులు - వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు. డిపాజిట్లు రెండేళ్లలో రెట్టింపవుతాయని చెప్పడంతో వేలాది మంది ఎగబడిమరీ కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. ఒక్కొక్కరు వేయి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేశారు. ఆర్బిఐ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన ఈ సంస్థ కాలపరిమితి తీరినా డబ్బు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు.
ఆ తరువాత ఈ సంస్థకు చెందిన నెల్లూరు, కావలి, గూడూరు... బ్రాంచ్లను ఈ ఏడాది ప్రారంభంలో మూసివేశారు. సంస్థ మూతబడడంతో తాము ఘోరంగా మోసపోయామని బాధితులు బావురుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత సంస్థ డైరెక్టర్ రమేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపధ్యంలో సీతారామపురంలో 2 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు సిరిగోల్డ్ ఎండి సుందరంపై ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉదయగిరి పోలీసులు అతనిని ఈరోజు అరెస్ట్ చేశారు.